
ఇచ్చిన అమౌంట్‌కి డబుల్ మనీ అంటూ కేటుగాళ్లు ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు.. తీరా 33 లక్షలకి టోకరా వేశారు.. తీరా ఆన్లైన్‌లో డబ్బులు జమ కావడం లే..దు అంటూ ఖాళీ పేపర్ బండిల్స్ ఇచ్చి అక్కడ నుంచి ఉడాయించారు.. తీరా బ్యాగ్ చూసి మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాళ్ళ ఆట కట్టించారు. అంతేకాకుండా.. వారు చేసిన మోసాన్ని పోలీసులు డెమో చేసి మరీ చూపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని గోకుల్ నగర్‌కు చెందిన గంగా ప్రసాద్ అనే వ్యక్తిని కొంతమంది కేటుగాళ్లు కలిసి.. బురిడీ కొట్టించారు. డబ్బుకు రెట్టింపు డబ్బును ఇస్తామని మోసం చేశారు. 33 లక్షల రూపాయలు ఇస్తే 50 లక్షలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తామని నమ్మించారు కేటుగాళ్లు.. మొదట సూట్‌కేసులో గంగా ప్రసాద్ తీసుకువచ్చిన 33 లక్షలను పెట్టమని చెప్పారు. అతను ఆ సూట్‌కేసులో 33 లక్షల రూపాయలకు సంబంధించిన బ్యాగును అందులో ఉంచగా వారు దానిని మూసివేశారు. కొద్దిసేపు గడిచిన తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగడం లేదని.. మీరు ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నామని చెప్పారు. అయితే.. ముందుగా ప్లాన్ ప్రకారం.. ఆ సూట్ కేసులో పేపర్ బండిల్స్ ను పెట్టి గంగా ప్రసాద్ కు అప్పజెప్పారు.
అయితే.. గంగా ప్రసాద్ చూసుకోకుండా ఆ సూట్‌కేసును ఇంటికి తీసుకెళ్లాడు.. అనంతరం బ్యాగులు చెక్ చేయగా అందులో పేపర్ బండిల్స్ మాత్రమే ఉన్నాయి.. దీంతో మోసపోయానని గ్రహించిన గంగా ప్రసాద్ వెంటనే ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మోసానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.. వారి వద్ద నుంచి ఎనిమిదిన్నర లక్షల రూపాయల నగదును, వాళ్లు బురిడీ కొట్టించిన సూట్‌కేసును.. అలాగే ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
వీరంతా వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో పులివెందుల నియోజకవర్గం చెందిన గంగులయ్య అనే వ్యక్తి, బెంగళూరుకు చెందిన పఠాన్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన నగేష్, దిల్‌సుఖ్‌నగర్ కు చెందిన గోపాల్, తిరుపతికి చెందిన పెంచలయ్య లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. మోసగాళ్లు ఏ విధంగా మోసం చేశారు.. అనే విషయాన్ని ప్రొద్దుటూరు ఏఎస్పీ డెమో చేసి మరి చూపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..