వైసీపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను సమస్యల నుంచి బయటపడేసే బాధ్యతను జనసేనకు అప్పగిస్తే వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించవచ్చని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్న పవన్ యువతకు ఉపాధి, ఉద్యోగాల్లేవని మండిపడ్డారు. ప్రెస్‌మీట్లు పెట్టి బూతులు తిట్టడానికీ టైం దొరుకుతుంది గానీ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సమయం ఉండటం లేదని ప్రశ్నించారు. జనవాణి (Janavani) కార్యక్రమం ద్వారా రైతులకు గిట్టుబాటు, కౌలు రైతుల సమస్యలతో పాటు టిడ్కో ఇళ్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యా పథకం సహా అనేక అంశాలపై ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్న జనసేనాని.. స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారం అయితే ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయని నిలదీశారు. తన నుంచి అద్భుతాలు ఆశించవద్దని, తాను సీఎం ను కానని కేవలం ఒక సగటు మనిషని అన్నారు. ఎన్నికల నాటికి ఎంత మంది నిలబడతారో తెలియదన్న పవన్.. ప్రజల కోసం జనసేన కచ్చితంగా నిలబడుతుందని స్పష్టం చేశారు.
ఉద్దానం సమస్య ఎక్కడో మారుమూలగా ఉండేది. మేం మాట్లాడాక ప్రపంచ సమస్యగా మారింది. నాయకుడికి హృదయం ఉండాలి. మనుషులతో మాట్లాడాలి. సమస్యలకు పరిష్కారం వెంటనే రాదు. పదిమందితో మాట్లాడే కొద్దీ పరిష్కారం వస్తుంది. వెనుజులా, శ్రీలంక లాంటి దేశాల్లో వనరులు ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడంతో విఫలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు వనరులు తక్కువ. దోచేయడానికి మాత్రం రూ.లక్షల కోట్లు దొరుకుతున్నాయి. సమర్థ నాయకత్వం లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.
– పవన్ కల్యాణ్, జనసేన అధినేత
భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. భీమవరం నుంచి పోటీ చేసిన వ్యక్తిగా తనకు ఇది ప్రత్యేకమని అన్నారు. ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి తనకూ ఆహ్వానం పంపినందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.