
గ్రంథాలయాలను సరస్వతి నిలయాలు అంటారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం. పూర్వం ఎపుడూ పుస్తకాలను పట్టుకుని తిరిగితే పుస్తకాల పురుగులు అనేవారు. కానీ, ఇపుడు చాలా మంది పుస్తకాలను పక్కన పడేసి సెల్‌ఫోన్లలోనే నిమగ్నమవుతున్నారు. ఆన్లైన్ చదువులు, పి డి ఎఫ్ పత్రికలు, కధలు – కవితలు వినటానికి, సందేశాలు సమాచారం పంచుకోవటానికి సోషల్ మీడియా విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుగం లో మనిషి యాత్రిక జీవితాన్ని అనుభవిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ప్రపంచం లో మానవ సంబంధాలు తెగిపోయాయని అంటున్నారు చాలా మంది విశ్లేషకులు.
పుస్తకాల పట్ల ఆసక్తి పెరగాలి, చదువుపై శ్రద్ధ తమపిల్లలకు ఉండటం లేదు.. అనే పేరెంట్స్ సైతం పుట్టినరోజు అంటే పిల్లలకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ కొనుగోలు చేసి ఇస్తున్న పరిస్థితులు. ఇలాంటి తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భీమవరంలో పిల్లలు పుస్తకాల పట్ల ఆకర్షితులు అయ్యేందుకు, వేసవి సెలవుల్లో వారిని పుస్తకాలకు దగ్గర చేసేందుకు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహించారు. వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందచేశారు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.
పుట్టిన రోజు సందర్భంగా అందరూ గ్రంథాలయాలకు ఒక పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు చదువరులతో కళ కళ లాడే గ్రంథాలయాల్లో ఈ కాలం విద్యార్థులకు అవసరమైన బుక్స్ అందుబాటులో ఉండటంలేదు. ఇలాంటి సమయంలో పుస్తకాలను గ్రంథాలయాలకు బహుమతిగా ఇవ్వటం, గ్రంథాలయాలకు టెంపుల్స్ కు ఇచ్చిన విధంగా విరాళాలు ఇస్తే ఎంతో మంది మేధావులు గతంలో మాదిరి తయారయ్యే అవకాశం వుందని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి