Andhra Pradesh: ఎత్తులకు పైఎత్తులు.. స్పెయిన్ గడ్డపై గోల్డ్ మెడల్‌తో సత్తా చాటిన తెలుగు తేజం జయకేతనం..

స్పెయిన్ గడ్డపై తెలుగు తేజం మెరిసింది.. 64 గళ్ల చదరంగ బోర్డుపై పదునైన ఎత్తులు వేస్తూ.. అంతర్జాతీయ హేమాహేమీలను చిత్తు చేసి ప్రతిష్ఠాత్మక బెనిడోర్మ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు. ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ స్థానాలకు చేరడమే తన అసలు లక్ష్యమని స్పష్టం చేశారు.

Andhra Pradesh: ఎత్తులకు పైఎత్తులు.. స్పెయిన్ గడ్డపై గోల్డ్ మెడల్‌తో సత్తా చాటిన తెలుగు తేజం జయకేతనం..
Lalith Babu Wins Gold In Spain

Edited By:

Updated on: Nov 09, 2026 | 4:53 PM

చదరంగం అంటే కేవలం 64 గళ్ల ఆట కాదు.. ప్రత్యర్థి ఎత్తును ముందే పసిగట్టే వ్యూహం.. ప్రతి అడుగులోనూ అప్రమత్తత.. గెలుపు కోసం చివరి వరకు పోరాడే పట్టుదల. అలాంటి చదరంగంలో తనదైన ఎత్తులతో అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించారు గ్రాండ్ మాస్టర్ ముసునూరి లలిత్ బాబు. స్పెయిన్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక బెనిడోర్మ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో తలపడి టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆయన.. స్వదేశానికి తిరిగి వచ్చి తన విజయానందాన్ని పంచుకున్నారు. స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ప్రపంచంలోని పలువురు ప్రతిభావంతమైన ఆటగాళ్లు పోటీపడ్డారు. ప్రతి మ్యాచ్‌లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, తన ఆటతీరుతో ఆకట్టుకున్న లలిత్ బాబు చివరకు విజేతగా నిలిచారు. ఈ టోర్నమెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ విజయం తనకు మరింత ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపారు.

బెనిడోర్మ్ విజయం ఒక మైలురాయి మాత్రమే.. తన అసలు లక్ష్యం ఇంకా ముందుందని లలిత్ బాబు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 300 లోపు స్థానంలో ఉన్న తాను.. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ టోర్నమెంట్లలో మరిన్ని విజయాలు సాధించి తన ర్యాంకును మెరుగుపరుచుకోవడమే లక్ష్యమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మరిన్ని విజయాలు అందించాలంటే క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అవసరం. ముఖ్యంగా విదేశీ టోర్నమెంట్లలో పాల్గొనడం, నిరంతర సాధన కొనసాగించడం కోసం ప్రభుత్వ సహకారం కీలకమని లలిత్ బాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం, ప్రోత్సాహం అందితే తన లక్ష్యాలను మరింత త్వరగా చేరుకోగలనని ఆశాభావం వ్యక్తం చేశారు..

స్పెయిన్ గడ్డపై సాధించిన బెనిడోర్మ్ ఓపెన్ విజయం లలిత్ బాబు చదరంగ ప్రయాణంలో కీలక ఘట్టం. అయితే ఆయన లక్ష్యం ఒక్క టైటిల్‌తో ఆగిపోవడం లేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవడం.. అంతర్జాతీయ వేదికలపై మరిన్ని పతకాలు సాధించడం.. తెలుగు రాష్ట్రాల కీర్తిని ప్రపంచ చదరంగ పటంలో మరింతగా చాటడమే తదుపరి టార్గెట్స్‌గా కనిపిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us