Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు భారీ శుభవార్త.. వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా..

టీటీడీ తిరుపతి వాసులకు ఉచితంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం ఉచితంగా కల్పిస్తోంది. ఈ విధానం ఎప్పటినుంచో అమల్లోకి ఉంది. అయితే ఇప్పుడు శ్రీశైలం దేవస్ధానం కూడా అదే తరహా విధానం ఒకటి అమల్లోకి తెచ్చింది. వారికి ఉచితంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించనుంది.

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు భారీ శుభవార్త.. వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా..
Srisailam Darshan

Updated on: Dec 30, 2025 | 10:26 PM

టీటీడీ తరహాలోనే శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనాన్ని స్థానిక తిరుపతి వాసులకు ఎప్పటినుంచో ఉచితంగా కల్పిస్తున్నారు. ప్రతీ నెలా మొదటి మంగళవారం స్థానిక ప్రజలు ఉచితంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కొంతకాలంగా కల్పిస్తోంది. దీంతో తిరుపతి వాసులు నెలలో ఒకరోజు శ్రీవారిని ఉచితంగా దర్శించుకుంటున్నారు. తమ ఆధార్ కార్డు చూపించి ఈ ఉచిత దర్శనాన్ని పొందుతున్నారు. అయితే తాజాగా శ్రీశైలం దేవస్థానం కూడా అలాంటి నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం శ్రీమల్లిఖార్జున స్వామి వారిని తరచూ వేలమంది దర్శించుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు.

చెంచులకు స్పర్శ దర్శనం ఫ్రీ

ఈ క్రమంలో శ్రీశైలంలో చెంచులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ నెలలో ఒకరోజు వారికి ఫ్రీ స్పర్శ దర్శన సౌకర్యం కల్పించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కార్యక్రమాన్ని ప్రారంభించగా.. తొలిరోజు 500 మంది చెంచులు స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నారు. ఇక నుంచి ప్రతీ నెలా ఒకరోజు స్పర్శ దర్శన సౌకర్యం ఉచితంగా కల్పించనున్నారు. గిరిజనులకు స్వామివారికి మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ప్రతీ నెలా చెంచు గిరిజనులతో కొంతమందిని ఎంపిక చేసి వారికి ఉచిత దర్శన సౌకర్య కల్పిస్తామని వెల్లడించారు.

ఐటీడీఏ సహాకారం

ఐటీడీఏ సాయంతో చెంచులకు ఉచిత స్పర్శ దర్శన సౌకర్యం కల్పించనున్నారు. ఆ సంస్థ సహాకారంతో చెంచులను ఎంపిక చేయనున్నారు. దర్శనంతో పాటు వసతి, రాకపోకలకు ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. తిరుమలలో స్థానికులకు ఉచిత దర్శన భాగ్యం టీటీడీ కల్పిస్తుందని, తాము కూడా అదే తరహాలోనే చెంచులకు అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం న్యూ ఇయర్ సెలవులు కావడంతో శ్రీశైలంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. త్వరలో సంక్రాంతి సెలవులు రానున్న క్రమంలో తాకిడి మరింతగా పెరగనుందని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లు ఆలయ అధికారులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.