ఏపీలో ఈసీ ఆదేశాలు… వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలకు దారితీశాయి. ఎలక్షన్ విధులతో పాటు ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొనొద్దంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో… రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున రాజీనామా చేస్తున్నారు వాలంటీర్లు. విపక్ష నేతల వైఖరితో మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నంలో 823 మంది వాలంటీర్లుండగా… ఒక్కసారే 430 మంది రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటు కర్నూలులోనూ 92 మంది వాలంటీర్లు తమ రాజీనామాను సమర్పించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 వందల మందికిపైగా వాలంటీర్లు రాజీనామా చేయడం పొలిటికల్ ఫైట్‌కు కారణమైంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వాలంటీర్ల విషయంలో తప్పు మీదంటే… మీదంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు.
వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబే అడ్డుకున్నారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వాలంటీర్లను ఆపి బడుగు-బలహీన వర్గాలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై పేర్ని నాని సైతం ఫైరయ్యారు. కొంతమంది వ్యక్తులతో కలిసి చంద్రబాబే వాలంటీర్ వ్యవస్థను ఆపేశారని విమర్శలు గుప్పించారు. ఇక వైసీపీ నేతల మాటలపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. వాలంటీర్లను వాడుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు. వాలంటీర్ల విషయంలో టీడీపీని తప్పున పడేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు.
మొత్తంగా… వాలంటీర్ వ్యవస్థపై పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్‌గా వాలంటీర్ల వరుస రాజీనామాలతో మరింత వేడెక్కింది ఏపీ రాజకీయం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..