
AP News: ఆదోని మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న నర్సమ్మ (30) ఆదివారం తెల్లవారుజామున స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రోడ్డు ఊడ్చే పనిలో నిమగ్నమైంది. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు. వెంటనే వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. నర్సమ్మ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు, తోటి కార్మికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు.
తీవ్ర గాయాలపాలైన ఆమెను 108 అంబులెన్స్‌లో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పురపాలక కమిషనర్ నయన్ అహ్మద్ బాధితురాలని పరామర్శించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదోని డీఎస్పీ వెంకటరమణ రెండో పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు శిరీష, రాములమ్మ, ఈరన్న, శిరీష తల్లిపై హత్యాయత్నం, దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు టూ టౌన్ పోలీసులు. చిన్న ఈరన్నతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతోనే నర్సమ్మను అంతమొందించడానికి వారు ప్రయత్నించారన్నారు పోలీసులు. శిరీషతో వివాహం కాకముందునుంచే చిన్న ఈరన్నకు నర్సమ్మతో పరిచయం ఉందని పోలీసులు గుర్తించారు. నర్సమ్మతో వివాహేతర సంబంధం కొనసాగించడం.. ఇంట్లో గొడవలు తలెత్తడంతో తీవ్ర ఒత్తిడికి గురై చిన్నఈరన్న ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి నరసమ్మే కారణమంటూ నిందితులు దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి