బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో.. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లు కూలగా.. పంటలు నేలవాలాయి. కాగా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షానికి నదులు పొంగిపొర్లుతున్నాయి.
శ్రీకాకుళంలోని భీమిలిలో 23, రణస్థలంలో 22, సోంపేటలో 20 సెంటి మీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 13.36 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. 2,450 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. 10 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. ఇక పట్టణంలో అనేక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా పాఠశాలలకు, కళాశాలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఇంకా జిల్లాలోని పలు ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సాధారణ స్థితికి చేరుకోవాలంటే కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది.
అలాగే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. గొల్లప్రోలు, సూర్యంపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు.. బోటు ద్వారా ప్రజలను తరలించేవారు. కానీ ఇప్పుడు అధికారులు స్పందిచకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా.. పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరిపిలేని వానతో.. జనాలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. కాగా.. నాగార్జున సాగర్ డ్యామ్‌కు ఎగువ నుంచి భారీగా నీరు చేరడంతో.. అధికారులు ఆరు గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తోంది. అలాగే.. ప్రకాశం బ్యారేజీకి కూడా నీటి ఉధృతి ఎక్కువగా చేరుకుంటోంది.