Rains: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. మూడ్రోజుల పాటు భారీ వర్షాలు..

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలో వానలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు వెదర్ బులిటెన్ విడుదల చేసింది.

Rains: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. మూడ్రోజుల పాటు భారీ వర్షాలు..
Rains Ap

Updated on: Jun 26, 2026 | 1:20 PM

నిన్నటి ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించింది. ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపు వంగి ఉంది. నిన్నటి ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఏర్పడిన ద్రోణి ఈరోజు తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ నుండి మధ్య మహారాష్ట్ర వరకు తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై నున్న ఉపరితల ఆవర్తనం, మరట్వాడా మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ .నుండి 4.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉంటాయనే దానిపై అమరావతి వాతావరణశాఖ వెదర్ బులిటెన్ విడుదల చేసింది.

ఏపీలో భారీ వర్షాలు

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ఈరోజు, రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే మోస్తారు నుండి తీవ్రమైన ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని స్పష్టం చేసింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడనున్నాయని అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ నెల 26,27,28వ తేదీల్లో భారీ వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

పిడుగుపాటు హెచ్చరిక

కాగా ఏపీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నాయి. వర్షం పడే సమయంలో విద్యుత్ స్తంభాల వద్ద నిలబడదవద్దని, చెట్ల కింద ఉండవద్దని సూచిస్తున్నారు. వర్షం పడే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దవని సూచిస్తున్నారు.

Follow Us