Rains: బంగాళాఖాతంలో ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులు..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా జారీ చేసి వెదర్ రిపోర్ట్‌లో పేర్కొంది.

Rains: బంగాళాఖాతంలో ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులు..
Rains

Updated on: Aug 04, 2026 | 3:55 PM

ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఏపీలో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.  రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా గజపతినగరం, శృంగవరపుకోట, భీమునిపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేస్తూ తేలికపాటి నుండి చెదురుమదురు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ ఉండకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.

తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు

సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ప్రస్తుతం అనూప్‌గఢ్, ఢిల్లీ, షాజహాన్‌పూర్, బస్తీ, ఛాప్రా మీదుగా నాగాలాండ్ వైపు కొనసాగుతోంది. దక్షిణ అంతర్గత కర్ణాటక, పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తీర ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడ్రోజుల పాటు వానలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.తెలంగాణలో అనేకచోట్ల రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ జిల్లాల్లో వర్షాలు

ఇవాళ తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30–40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక రేపు, ఎల్లుండి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30–40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లవద్దని తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us