Weather Report: ఈ సమయంలో అసలు బయటకు రావొద్దు.. ఏపీ, తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. వడగాల్పులపై వాతావరణశాఖ హెచ్చరిక

ఏపీ, తెలంగాణలో హీట్ వేవ్ కొనసాగుతోంది. భానుడి తీవ్రతతో పాటు వడగాలులు, ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక ఏపీలో పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది.

Weather Report: ఈ సమయంలో అసలు బయటకు రావొద్దు.. ఏపీ, తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. వడగాల్పులపై వాతావరణశాఖ హెచ్చరిక
Summer Heatwave in AP and Telangana

Updated on: Apr 14, 2026 | 6:59 AM

ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య బయటకు రావొద్దని వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న క్రమంలో ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు తారాస్థాయిలో వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి మొదలవుతున్న భానుడి ప్రతాపం.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. భానుడి తీవ్రతకు బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావడం లేదు.

ఇక్కడ తీవ్ర వడగాల్పులు

ఏప్రిల్ 14వ తేదీన రాయలసీమ, కోస్తా జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని, మరో 44 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాలులు ఉంటాయని హెచ్చరించింది. పోలవరం జిల్లాల్లో 3 మండలాల్లో, శ్రీకాకుళం జిల్లాల్లో 4 మండలాల్లో, విజయనగరం జిల్లాల్లో 9, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని హెచ్చరించింది. అటు సోమవారం కడపలో అత్యధిక ఉష్ణోగ్రత 44.4 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా.. నంద్యాల జిల్లా సంజామలలో 44 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది. అటు పల్నాడు జిల్లా దుర్గిలో 42.8 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా నూలివీడులో 42 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణశాఖ పేర్కొంది.

మధ్యాహ్నం వేళల్లో జాగ్రత్త

మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళితే టోపీ ధరించాలని, లేకపోతే గొడుగు ఉంచుకోవాలని వాతావరణశాఖ తెలిపింది. వాటర్ ఎక్కువగా త్రాగుతూ ఉండాలని, మజ్జిగ లాంటివి తీసుకోవాలని సూచించింది. ఎండ ప్రభావంతో పాటు వడగాలుల వల్ల వడదెబ్బ బారిన పడే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అటు తెలంగాణలో రానున్న వారం రోజులు హీట్ వేవ్ కొనసాగే అవకాశముందని, ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావారణశాఖ తెలిపింది. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో సోమవారం నులుగురు మృత్యువాత పడ్డారు. సోమవారం నిజామాబాద్‌లో 43.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. దీంతో నగరవాసులు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావడం లేదు. దీంతో నగరంలోని రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అటు నగరంలో ఎండతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరికొద్ది రోజుల పాటు ఎండ తీవ్రత ఇలాగే కొనసాగనుంది.

Follow Us