శవాలపై పేలాలు ఏరుకునే కక్కుర్తి.. మృత ఉద్యోగి కుటుంబం నుంచి లంచం అడిగి బుక్కైన జీవీఎంసీ అధికారి

GVMC Bribe Case: విశాఖపట్నంలోని జీవీఎంసీ వెస్ట్ జోన్ కార్యాలయంలో అవినీతి వెలుగుచూసింది. మృత పారిశుద్ధ్య కార్మికుడికి రావాల్సిన రూ.30 లక్షల బెనిఫిట్స్ విడుదల కోసం రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ ఎం.శ్రీనును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో నిర్వహించిన ట్రాప్‌లో నిందితుడు బుక్కయ్యాడు.

శవాలపై పేలాలు ఏరుకునే కక్కుర్తి.. మృత ఉద్యోగి కుటుంబం నుంచి లంచం అడిగి బుక్కైన జీవీఎంసీ అధికారి
GVMC Bribe Case

Edited By:

Updated on: Jun 20, 2026 | 10:32 AM

ఎంతమంది పట్టుబడుతున్నా… మరింత మందిపై ఏసీబీ అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నా.. అవినీతి ఉద్యోగుల్లో ప్రవర్తన మారడం లేదు. పనికో రేట్ ఫిక్స్ చేసి సామాన్యుల నుంచి అందిన గాడికి దోచుకుంటున్న వాళ్ళు.. సొంత శాఖలో ఉన్న వారినీ వదలడం లేదు. చివరకు చనిపోయిన పారిశుద్ధ్య కార్మికుడి సంబంధించి ఫైల్ కదిలించేందుకు కూడా లంచాలు అడిగి శవాలపై పేలాలు ఏరుకునేలా కక్కుర్తి పడుతున్నారు. తాజాగా విశాఖ జీవీఎంసీ వెస్ట్ జోన్‌లో ఓ టాక్స్ కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తికి చెందిన అప్పలనారాయణ జీవీఎంసీలో పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు గ్రాట్యుటీ, తదితరాలు కలిపి సుమారు 30 లక్షల వరకు రావలసి ఉంది. మూడేళ్లు గడిచిన ఆ కుటుంబానికి ఆ బెనిఫిట్స్ అందలేదు. ఈ విషయంపై అప్పలనారాయణ భార్య అనేకమార్లు ఎన్‌ఏడీ జంక్షన్‌ సమీపంలోని గౌరీనగర్‌లో ఉన్న జీవీఎంసీ వెస్ట్ జోనల్‌ కార్యాలయానికి వెళ్లారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే.. ఆ ఫైల్స్‌ను పైకి పంపాలంటే తనకు 50 వేలు ఇవ్వాలని జూనియర్‌ అసిస్టెంట్‌ ఎం.శ్రీను డిమాండ్‌ చేశాడు. 30 వేలకు బేరం కుదిరింది. తన భర్త కష్టార్జితంగా రావలసిన బెనిఫిట్స్ చనిపోయాక బాధ్యతగా ఇవ్వాల్సిన అధికారులు లంచం అడగడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. లంచం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆమె ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జోనల్‌ కార్యాలయంలో అప్పలనారాయణ భార్య వద్ద శ్రీను 30 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచాలు అడిగితే 1064కు లేదా నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు ఏసీబీ అడిషనల్‌ ఎస్‌పీ పి.హర్షిత. నిందితుడు శ్రీనుపై కేసు నమోదు చేశామని.. ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు ఏసీబి డీఎస్పీ రమణమూర్తి.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

 

Follow Us