ఆ రోడ్డుపై రాత్రి ప్రయాణమంటేనే భయం.. కర్రలు పట్టుకుని గస్తీ కాస్తున్న యువకులు

గుంటూరు సమీపంలోని వెంగళాయపాలెం నుంచి చిలకలూరిపేట హైవేకు వెళ్లే రోడ్డుపై రాత్రివేళ ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మలుపుల వద్ద కత్తులతో బెదిరించి దోపిడీలు చేస్తున్నారనే ప్రచారంతో స్థానిక యువకులు కర్రలు పట్టుకుని రాత్రివేళల్లో గస్తీ కాస్తున్నారు. అయితే ఇప్పటివరకు దోపిడీలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచుతామని హామీ ఇచ్చారు.

ఆ రోడ్డుపై రాత్రి ప్రయాణమంటేనే భయం.. కర్రలు పట్టుకుని గస్తీ కాస్తున్న యువకులు
Nallapadu Police Station

Edited By:

Updated on: Oct 05, 2026 | 5:35 PM

గుంటూరు నగర సమీపంలోని వెంగళాయపాలెం రోడ్డుపై రాత్రివేళ ప్రయాణం చేయాలంటేనే స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రయాణికులను దుండగులు కత్తులతో బెదిరించి డబ్బులు, సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నారనే ప్రచారం స్థానికంగా ఆందోళనకు కారణమవుతోంది. దీంతో ఇంతకాలం ప్రయాణికులు వెళ్లిన ఆ రోడ్డుపై ఇప్పుడు యువకులే కర్రలు పట్టుకుని రాత్రివేళల్లో గస్తీ కాస్తున్నారు.

మలుపుల దగ్గరే మాటు?

వెంగళాయపాలెం నుంచి చిలకలూరిపేట హైవేకు వెళ్లే ఈ మార్గంలో ఎక్కువగా మలుపులు ఉండటంతో పాటు సరైన వీధి దీపాలు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. దీంతో రాత్రివేళల్లో రోడ్డుపై చీకటి అలుముకుంటుందని, ఇదే దొంగలకు అనుకూలంగా మారుతోందని అంటున్నారు. మలుపుల వద్ద వాహనాల వేగం తగ్గిన సమయంలో అక్కడే మాటువేసి ఉండే దుండగులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి కత్తులతో బెదిరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మార్గాన్ని వెంగళాయపాలెం నుంచి వివిధ పనుల కోసం వెళ్లే వారితో పాటు జాతీయ రహదారి మీదుగా సత్తెనపల్లి వైపు వెళ్లే ప్రయాణికులు కూడా ఉపయోగిస్తుంటారు. దీంతో రాత్రివేళ ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వారిలో భయాందోళనలు పెరిగాయి.

ప్రయాణికులకు అండగా యువకులు

గ్రామంలో భయాందోళనలు పెరగడంతో స్థానిక యువకులు స్వయంగా రంగంలోకి దిగారు. రాత్రి సమయాల్లో కర్రలు చేతపట్టుకుని రోడ్డుపై గస్తీ కాస్తున్నారు. గ్రామానికి వచ్చే వారితో పాటు ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దోపిడీలకు పాల్పడుతున్న వారు స్థానిక ప్రాంతంపై అవగాహన ఉన్న వ్యక్తులే అయి ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.

పోలీసులు ఏమంటున్నారు?

మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ.. ఇప్పటివరకు దోపిడీలకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు. అయినప్పటికీ స్థానికుల ఆందోళన దృష్ట్యా రాత్రివేళల్లో గస్తీ, పెట్రోలింగ్‌ను పెంచుతామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రస్తుతం స్థానిక యువకులు రాత్రివేళల్లో గస్తీ కాస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే వెంగళాయపాలెం రోడ్డుపై నిజంగానే దోపిడీలు జరుగుతున్నాయా? లేక ప్రచారంతోనే భయాందోళనలు పెరిగాయా? అన్నది పోలీసుల దర్యాప్తు, అధికారిక ఫిర్యాదుల తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us