
గంటూరు జిల్లాలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఐదో తేదిన పదహారో నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బొంతపాడు పొల్లాలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మృతుడి వివరాలు సేకరించేందుకు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి కృష్నా జిల్లా అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెంకు చెందిన ఆనంద్ కిషోర్ గా గుర్తించారు. అయితే మ్రుతుడి ఒంటిపై గాయాల ఉండడంతో ఇది హత్యగా నిర్ధారించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో అతని యజమానే హత్య చేసినట్లుగా తేల్చి యజమానిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ కిషోర్ గతంలో ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతను గుంటూరుకు మకాం మార్చి ఆర్ అగ్రహారంలో ఒక గదిలో అద్దెకు ఉంటున్నాడు. నల్లచెరువుకు చెందిన వంట మాస్టర్ ఖాసిం వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఖాసీం ఫంక్షన్స్ ఒప్పుకున్న తర్వాత తన టీంతో వెళ్లి వంటలు చేసి వచ్చేవాడు. కానీ గత కొంతకాలంగా ఆనంద్ పనులకు వెల్లకుండా డుమ్మాకొడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సకాలంలో వంట చేయలేక ఖాసిం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆర్డర్స్ క్యాన్సిల్ అయి నష్టాలు కూడా వచ్చాయి.
ఇక ఎన్నిసార్లు పద్దతి మార్చుకోమని చెప్పినా ఆనంద్ వినకపోవడంతో ఖాసిం ఆనంద్‌ను చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు. తన నష్టాలకు, ఇబ్బందులకు ఆనందే కారణమని గట్టిగా నమ్మిన ఖాసిం ఈ నెల ఐదో తేదిన ఆనంద్ రూం వద్దకు వెళ్లి మద్యం సేవిద్దామంటూ పిలుచుకెళ్లాడు. ద్విచక్ర వాహనంపై ఇద్దరూ వెళ్లారు. మొదట మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత బైక్ పై బొంతపాడు పొలాల్లోకి వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత ఆనంద్ మత్తులోకి జారుకున్నాడు. ప్లాన్ ప్రకారమే అక్కడకు వచ్చిన ఖాసిం కర్రతో, రాళ్లతో ఆనంద్ పై దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడ నుండి జారుకున్నాడు. మద్యం మత్తులో తీవ్ర గాయాలైన ఆనంద్ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదుచేసిన పోలీసులు సిసి కెమెరా విజువల్స్ సాయంతో నిందితుణ్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.