ఇలాంటి శివలింగం దేశంలో ఎక్కడా లేదు.. మన ఏపీలో.. నవపాషాణాలతో

తిరుపతి సమీపంలోని గుడిమల్లం పరశురామేశ్వరాలయం శతాబ్దాల చరిత్ర కలిగిన అరుదైన ఆలయం. ఇక్కడ పురుషాకారాన్ని పోలిన విశిష్టమైన శివలింగం పూజలందుకుంటోంది, ఇది భారతదేశంలో మరెక్కడా కనిపించదు. క్రీస్తుపూర్వం 2వ-3వ శతాబ్దం నాటిదిగా పురావస్తు శాఖ అంచనా వేస్తున్న ఈ ఆలయం.. మౌర్య, తొలి బౌద్ధ, శాతవాహన కాలాల నాటి ఆధారాలను కలిగి ఉంది.

ఇలాంటి శివలింగం దేశంలో ఎక్కడా లేదు.. మన ఏపీలో.. నవపాషాణాలతో
Gudimallam Temple

Updated on: Feb 20, 2026 | 3:59 PM

తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం గుడిమల్లం గ్రామంలో ఉన్న పరశురామేశ్వర ఆలయం భారతదేశంలోని ప్రాచీన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివలింగం పురుషాకారాన్ని తలపించేలా ఉండటం దీని విశిష్టత. నవపాషాణాలతో అంటే తొమ్మిది రకాల పదార్థాలతో నిర్మితమైన ఈ అరుదైన శిల్పం భారతదేశంలో మరెక్కడా కనిపించదని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్కియలాజికల్ అధ్యయనాల ప్రకారం, కొందరు ఇది భూమికి సంబంధించినది కాదని, ఉల్కాపాతం పడినప్పుడు దానితో ఏర్పడిన లింగం అని వాదిస్తున్నారు. అయితే ఈ వాదనలకు శాస్త్రీయ నిరూపణ ఇంకా జరగవలసి ఉంది. ఏదేమైనా, ఈ లింగం ప్రత్యేకత దాని ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది.

క్రీస్తుపూర్వం రెండవ లేదా మూడవ శతాబ్దం నాటికే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని భారత పురావస్తు శాఖ అంచనా వేశారు. సుదీర్ఘకాలంగా భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ ఆలయంలో 2009 వరకు పూజా కార్యక్రమాలకు అనుమతి లేదు. నిర్మాణానికి హాని కలగని విధంగా పూజలు నిర్వహించేందుకు అనుమతించిన తరువాత భక్తుల రాకపోకలు పెరిగాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవదాయ శాఖ చూసుకుంటోంది. ఆలయ అధికారుల వివరాల ప్రకారం… పరశురాముడే ఈ విశిష్ట శివలింగాన్ని ప్రతిష్టించాడని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ పూజలు చేయడం వల్ల పెళ్లికాని వారికి వివాహం జరుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రబల నమ్మకం ఉంది.

సువర్ణముఖి నదికి సమీపంలో ఉంది ఈ ఆలయం. ప్రస్తుతం నదీ ప్రవాహం తగ్గుతున్నప్పటికీ, ఒకప్పుడు వరదల సమయంలో నదీ జలాలు ఆలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని తాకేలా నిర్మించిన ఏర్పాటు ఇప్పటికీ చెక్కుచెదరలేదని అధికారులు తెలిపారు. ఆలయం పల్లంలో ఉండటం వల్లనే దీనికి గుడిపల్లెం అనే పేరు వచ్చిందని, కాలక్రమేణా అది గుడిమల్లంగా మారిందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయంలోని ఏడు అడుగుల శివలింగంపై తలపాగా, దోవతి ధరించిన రుద్రుని రూపం కనిపిస్తుంది. ఒక చేతిలో పశువును, మరో చేతిలో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన ఈ రుద్రుడి వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని అంచనా వేస్తున్నారు. 1954లో భారత పురావస్తు శాఖ ఈ కట్టడాన్ని తమ పరిధిలోకి తీసుకుంది. అంతకుముందు 1911లోనే గోపీనాథరావు అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ ఆలయంపై ఏడాదిపాటు పరిశోధనలు చేశారు. 1908 నాటి బ్రిటిష్ గెజిట్లలో కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. ప్రస్తుత గోపురం తవ్వకాల్లో లభించిన శాసనాల ఆధారంగా, 12వ శతాబ్దంలో విక్రమచోళుడి కాలంలో దీనిని పునర్నిర్మించి ఉండవచ్చని ఒక అంచనా ఉంది. చోళుల తర్వాత పల్లవ, గంగపల్లవ, రాయల కాలాల్లో కూడా ఈ ఆలయంలో పూజాధికాలు సాగినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. 1970లో జరిగిన త్రవ్వకాలలో ఈ శివలింగం కింద మౌర్యుల కాలం నాటి నాణేలు, ఇటుకలు, నలుపు మెరిసే పాత్రలు లభించాయి. శివలింగం చుట్టూ ఉన్న చిన్న రైలింగ్‌పై తొలి బౌద్ధ కాలపు ఆనవాళ్లు కూడా గుర్తించారు. ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి కట్టడంగానూ ఈ ఆలయాన్ని భావిస్తారు.

ఉజ్జయినిలో దొరికిన రాగి నాణేలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ లభించిందని, మధుర మ్యూజియంలో కూడా ఇలాంటి శిల్పం ఒకటుందని కొన్ని పుస్తకాల్లో పేర్కొన్నారు. ఆనంద కుమారస్వామి, జితేంద్రనాథ్ బెనర్జీ వంటి అంతర్జాతీయ పురావస్తువేత్తలు కూడా ఈ శివలింగాన్ని తమ రచనల్లో ప్రస్తావించారు.

ఆదిశివలింగంగా ప్రసిద్ధి చెందిన గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీన శివాలయాలలో ఒకటి. దాదాపు 2200 ఏళ్ల క్రితమే దీని ఉనికి చాలామంది చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు. దీని నిర్మాణ విశిష్టత అంతర్జాతీయ పరిశోధకులను ఆకర్షిస్తోంది. భక్తుల సంఖ్య పెరుగుతుండగా, 2026 ఏప్రిల్ 23న ఆలయంలో.. మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

Also Read: జెర్రిపోతు ఎదురైతే టర్కీ కోడి రియాక్షన్ చూశారా..?

 

Follow Us