
పార్వతీపురం మన్యం, జనవరి 23: దంపతుల మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారాయి. క్షణికావేశంలో పిల్లలతోపాటు తమ ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంకి చెందిన మీనాక మధుకు (35), భార్య సత్యవతి (30), కుమార్తె మోస్య (4), మరో కుమార్తె ఉన్నారు. గతకొంత కాలంగా మధు, సత్యవతికి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దంపతులు మరోమారు గొడవ పడగా.. క్షణికావేశంలో దంపతులు ఇద్దరు విషం తాగి, ఇద్దరు కుమార్తెలతో తాగించారు. గమనించిన స్థానికులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మధు, సత్యవతి, మోస్య మృతి చెందారు. వీరి మరో కుమార్తె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. దంపతుల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాల కోసం పోలీసులు కుటుంబ సభ్యులను, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.