జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తప్పుడు పనులు చేసిన వారిపై కేసుల నమోదులో కులాల ప్రస్తావన ఉండదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వాళ్లు రాజకీయాలు చేస్తారనే అయ్యన్నపాత్రుడిని అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఫోర్జరీ చేసిన అయ్యన్నను అరెస్టు చేస్తే చంద్రబాబు వక్ర భాష్యం చెబుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. సానుభూతి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఆరితేరిపోయారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అనుకూలతను బట్టి పవన్ కళ్యాణ్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు ఏర్పాటు చేసిన వలయం ఉందన్న కొడాలి నాని.. పవన్ కల్యాణ్ కు ఏం జరిగినా అంటే మంచి జరిగినా, చెడు జరిగినా చంద్రబాబుదే బాధ్యత అని కొడాలి నాని స్పష్టం చేశారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసింది తప్పని చంద్రబాబు అంగీకరించారన్న ఆయన.. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేయటం తప్పుకాదా అని ప్రశ్నించారు.
కాగా.. ఎన్ని వేశాలు వేసినా టీడీపీ అధికారంలోకి రాదని మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు. ఏ కేసులోనూ అరెస్టు చేయకూడదన్న చంద్రబాబు మాటలపై స్పందిస్తూ.. నారా వారి రాజ్యాంగాన్ని అమలు చేయాలా అని ఎద్దేవా చేశారు. అయ్యన్న తప్పు చేసినందు వల్లే అరెస్టు అయ్యారని చెప్పారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా బీసీలు ఆయన వెంట నడవరన్న మంత్రి.. కుప్పంలో కూడా చంద్రబాబు ఓటమి తప్పదని స్పష్టం చేశారు.
జనసేన, పవన్ కల్యాణ్, అయ్యన్నపాత్రుడి అరెస్టుపై చంద్రబాబు స్పందించారు. కబ్జాల గురించి ప్రశ్నించిన అయ్యన్నను అరెస్టు చేశారని మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడిని అక్రమంగా అరెస్టు చేశారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ మీద దాడులు చేస్తారా. చంపేస్తారా తెల్లవారు జామున 3 గంటలకు వెళ్లి అయ్యన్నను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు తాగి గోడలు దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఏపీలో కాపు సర్కిళ్లల్లో పవన్ కల్యాణ్ ను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారంటూ విపరీతంగా ప్రచారం చేస్తుండటం గమనార్హం.
మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.