
జనసేన పార్టీకి కొత్త ప్రధాన కార్యదర్శి నియమితులయ్యారు. ప్రముఖ సినీ నిర్మాత, సాఫ్ట్‌వేర్ రంగ నిపుణుడు రామ్ తాళ్ళూరిని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన కార్యదర్శి పదవికి నియమించారు. పార్టీ సంస్థాగత అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు.
ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో వెల్లడించిన పవన్ కల్యాణ్.. 2014లోనే పార్టీ కోసం పనిచేయాలనే సంకల్పాన్ని రామ్ తాళ్ళూరి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అప్పటినుంచి పార్టీ పట్ల అంకితభావంతో, అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా తెలంగాణ విభాగంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నట్లు పవన్ వెల్లడించారు. అలాగే రామ్ తాళ్ళూరికి ఉన్న సంస్థాగత నైపుణ్యం, ప్రొఫెషనల్ అనుభవం కారణంగానే ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాకు ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.
రామ్ తాళ్ళూరి సాఫ్ట్‌వేర్ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్త. పలు సాఫ్ట్‌వేర్ సంస్థలను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తున్నారు. అదే సమయంలో సినీ నిర్మాతగానూ మంచి గుర్తింపు పొందారు. చుట్టాలబ్బాయి, నేల టికెట్, డిస్కో రాజా, మెకానిక్ రాకీ వంటి చిత్రాలను నిర్మించి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు.
రామ్ తాళ్ళూరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులవడంతో, ఆయన అనుభవం, నిర్వాహక నైపుణ్యం జనసేనకు మరింత బలాన్ని చేకూరుస్తుందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసే కీలక భూమికను ఆయన పోషించే అవకాశం ఉంది.