
ఇంద్రకీలాద్రిపై మరో సంచలన వివాదం వెలుగులోకి వచ్చింది. నకిలీ డాక్యుమెంట్లతో అర్చక ఉద్యోగాన్ని కాజేయడానికి ప్రయత్నించిన ఘటన ఇప్పుడు దేవస్థాన వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చనిపోయిన అర్చకుడి పేరును ఉపయోగించి వారసుడిగా ఎంట్రీ ఇవ్వాలన్నయత్నం బయటపడటంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.
శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన అర్చకుడు లింగాల సాయిబాబు 2022లో మరణించారు. ఆయన స్థానంలో వారసత్వ హక్కు ఉందని పేర్కొంటూ లింగాల దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఉద్యోగానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియలో దత్తతకు సంబంధించిన పత్రాలు నకిలీవని ఆరోపణలు వచ్చాయి. ఇదే వ్యక్తి గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం చేసినట్టు చెబుతున్నారు. 2009లో నామయ్య అనే అర్చకుడి పేరుతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి.. దీంతో ఈ వ్యవహారం వెనుక పునరావృత ప్రయత్నాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, సంబంధిత పత్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా పొందినట్టు ప్రచారం జరుగుతోంది. దీనితో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ విషయాన్ని తాడేపల్లికి చెందిన కోడూరు లక్ష్మీ పద్మావతి వెలుగులోకి తీసుకువచ్చారు. తన చిన్నాన్న లింగాల సాయిబాబు పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె దేవస్థాన ఈవో శీనా నాయక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంతరం అధికారులు అప్రమత్తమై దిలీప్ కుమార్ నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని బాధితురాలు కోరుతున్నారు.ఇదిలా ఉండగా, కమిషనర్ కార్యాలయంలో పత్రాల పరిశీలన సరైన విధంగా జరగలేదని కొంతమంది అర్చకులు ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ ద్వారా నిజాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అర్చక నియామకంపై వచ్చిన ఈ ఆరోపణలు దేవస్థాన పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నకిలీ పత్రాల వినియోగం జరిగిందా, లేక ఆరోపణలకే పరిమితమా అన్నది అధికారిక విచారణ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.