రోడ్డు పక్కన అర్థరాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు.. వచ్చి పోయే వాహనాలను ఆపి..

మార్కాపురం జిల్లాలోని పామూరు సమీప నెల్లూరు హైవే జంక్షన్ వద్ద మైనింగ్, పోలీసు, ఆర్మీ అధికారులమంటూ లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్మీ పిస్టల్‌, నకిలీ గుర్తింపు కార్డులతో వాహనాలను ఆపి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ వెంకటేశ్వరరెడ్డి అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డు పక్కన అర్థరాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు.. వచ్చి పోయే వాహనాలను ఆపి..
Markapuram Highway Robbery
Image Credit source: AI Photo

Edited By:

Updated on: Jun 18, 2026 | 1:24 PM

పోలీసులు, ఆర్మీ అధికారుల పేరుతో హైవేపై వాహనాలు ఆపి డబ్బులు దండుకుంటూ దోపిడీకి పాల్పడుతున్న ముఠాను మార్కాపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి చాకచక్యంతో పట్టుకుని నకిలీగాళ్ళకు అరదండాలు వేశారు.. మైనింగ్‌ అధికారులు పిలుస్తున్నారని లారీలను, రవాణాశాఖ అధికారులు పిలుస్తున్నారంటూ వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. మార్కాపురంజిల్లా పామూరు దగ్గర రాత్రి వేళల్లో మాటు వేసి నెల్లూరు జంక్షన్ హైవేపై మైనింగ్ అధికారినంటూ డమ్మీ పిస్టల్ చూపించి లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన రియల్ పోలీసులు నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అసలేం జరిగిందంటే…

మార్కాపురంజిల్లా పామూరు సమీపంలోని నెల్లూరు హైవే జంక్షన్లో వైట్ క్వార్ట్జ్‌, ఇసుక లారీలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఇంతలో ఓ కారులో అధికారుల మంటూ మాటువేసిన ముగ్గురు వ్యక్తులు లారీలను ఆపారు. తాము మైనింగ్‌ అధికారులమని చెబుతూ డమ్మీ పిస్టల్ చూపించి బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కార్లను ఆపి తాము ఆర్మీ ఉద్యోగులమని, పోలీసులమని తెలిపారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంతమంది స్థానిక వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న సిఎస్ పురం ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి మరో ముగ్గురు కానిస్టేబుల్స్ ఘటనా స్థలానికి చేరుకుని వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు నకిలీలను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల దగ్గర ఉన్న డమ్మీ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ ఐడెంటిటీ కార్డుతో తాము ఆర్మీ ఉద్యోగులమని, మైనింగ్ శాఖ అధికారులమని చెప్పి లారీలను ఆపి డబ్బులు ఇవ్వకుంటే డమ్మీ పిస్టల్ చూపించి డ్రైవర్లను భయపెడుతున్నట్టు గుర్తించారు.

హైవే రోడ్లపై మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్య తీసుకుంటామని, లారీ డ్రైవర్లు, ప్రజలు ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బులు అడిగితే వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. నకిలీలను పోలీసులు అరెస్ట్ చేయడంతో హైవేపై లారీ డ్రైవర్లు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న ముఠా గతంలో చేసిన నేరాలు, వీరి వెనుక ఉన్న ముఠా సభ్యుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us