డబ్బా బ్రాండెడ్.. లోపల మాత్రం కల్తీ ఇంజన్ ఆయిల్.. ఇది తెలిస్తే వాహనదారుల గుండెల్లో గుబులే..

విజయవాడ ఆటోనగర్ కేంద్రంగా నకిలీ ఇంజన్ ఆయిల్ దందా నడుస్తోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వాడిన ఇంజన్ ఆయిల్‌ను శుద్ధి చేసి, ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నకిలీ ఆయిల్ వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతినడం, మైలేజ్ తగ్గడం, భారీ మరమ్మత్తుల ఖర్చులు రావడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని మెకానిక్‌లు హెచ్చరిస్తున్నారు.

డబ్బా బ్రాండెడ్.. లోపల మాత్రం కల్తీ ఇంజన్ ఆయిల్.. ఇది తెలిస్తే వాహనదారుల గుండెల్లో గుబులే..
Fake Engine Oil Racket

Edited By:

Updated on: Jun 12, 2026 | 6:05 PM

వాహనం ఇంజన్‌ను కాపాడాల్సిన ఇంజన్ ఆయిల్… ఇప్పుడు అదే ఇంజన్‌కు శత్రువుగా మారుతోందా..? బ్రాండెడ్ కంపెనీల పేర్లతో విక్రయిస్తున్న ఇంజన్ ఆయిల్ అసలు ఒరిజినల్ కాదా..? విజయవాడ ఆటోనగర్ కేంద్రంగా నడుస్తున్న నకిలీ ఇంజన్ ఆయిల్ దందా వెనుక అసలు కథ వేరే ఉందా..? వాడిన ఇంజన్ ఆయిల్‌ను రీసైకిల్ చేసి, మళ్లీ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో మార్కెట్లోకి పంపిస్తున్నారన్న ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. విజయవాడ కొత్త ఆటోనగర్‌లో కనిపించిన దృశ్యాలు.. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వాడిన ఇంజన్ ఆయిల్.. భారీ డ్రమ్ముల్లో నిల్వ, బాయిలర్లలో మరిగింపు.. ఆ తర్వాత మరోసారి శుద్ధి పేరుతో ప్రాసెసింగ్. చూడటానికి ఇది సాధారణ పరిశ్రమలా కనిపించినా..? ఇక్కడ జరుగుతున్న ప్రక్రియపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వాడిన ఇంజన్ ఆయిల్‌ను సేకరించి ఇక్కడికి తీసుకువస్తున్నారు. అనంతరం ప్రత్యేక ప్రక్రియ ద్వారా మళ్లీ ఆయిల్‌గా తయారు చేసి భారీ డ్రమ్ముల్లో నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రీసైకిల్ చేసిన ఈ ఆయిల్ ఎక్కడికి వెళ్తోంది..

ఎవరి చేతుల్లోకి చేరుతోంది.. అనే ప్రశ్నలకు సమాధానం వెతికిన టీవీ9 బృందానికి మరో షాకింగ్ విషయం తెలిసింది. రీసైకిల్ చేసిన ఆయిల్‌ను ఆటోనగర్‌లోని ఓ గోదాంనకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా…గోదాం బయట ఎవరూ కనిపించలేదు… తలుపులు మూసి ఉన్నాయి. కానీ లోపల మాత్రం వందల సంఖ్యలో ఆయిల్ డబ్బాలు, ప్యాకింగ్ మెటీరియల్, ప్రముఖ కంపెనీల బ్రాండ్లను పోలిన ప్యాకెట్లు కనిపించాయి. రీసైకిల్ చేసిన ఆయిల్‌ను ఇక్కడ బ్రాండెడ్ ఇంజన్ ఆయిల్‌లా ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నకిలీ ఆయిల్ వ్యవహారంపై ఆటోనగర్‌లోని పలువురు మెకానిక్‌లను ప్రశ్నించగా.. ఇటీవల కాలంలో నకిలీ ఇంజన్ ఆయిల్ విక్రయాలు గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు. నకిలీ ఆయిల్ వాడితే ఇంజన్ జీవితకాలం తగ్గిపోతుంది. ఇంజన్ వేడెక్కడం, పిస్టన్ సమస్యలు, మైలేజ్ తగ్గడం, భారీ మరమ్మత్తులు తప్పవు..

ఇక వాహనదారుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మార్కెట్లో లభిస్తున్న ఆయిల్‌లో ఏది ఒరిజినల్.. ఏది నకిలీ అన్నది గుర్తించడం కష్టంగా మారిందని వాహన యజమానులు చెబుతున్నారు.
గతంలో ఇంజన్ పదివేల కిలోమీటర్ల వరకు బాగానే ఉండేది. ఇప్పుడు ఆరు, ఏడు వేల కిలోమీటర్లకే పనితీరు తగ్గిపోతోంది. పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతోందని చెప్తున్నారు..

లీటర్‌కు 300 నుంచి 700 రూపాయల వరకు ధరలు వసూలు చేస్తున్నప్పటికీ నాణ్యతపై ఎలాంటి హామీ లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఆయిల్ వల్ల వాహన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం, సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us