
ఫేస్‌బుక్‌లో కనిపించిన ఈ ఒక్క మెసేజ్.. ఓ యువకుడి జీవితంలో పెద్ద టెన్షన్ క్రియేట్ చేసింది. అవతల ఉన్నది ఓ అమ్మాయి అనుకున్నాడు. పరిచయం పెంచుకున్నాడు. చాటింగ్ చేశాడు. చివరకు వ్యక్తిగత ఫోన్ నంబర్ కూడా ఇచ్చేశాడు. కానీ.. తనను పలకరించింది అమ్మాయి కాదని తెలిసేలోపే సైబర్ నేరగాళ్లు అసలు గేమ్ మొదలుపెట్టారు.. ఒక్కసారిగా ఫోన్ వచ్చింది. నేను పోలీస్ ఆఫీసర్‌ను.. మీ పేరు ఒక కేసులో ఉంది. అంటూ అవతలి వ్యక్తి బెదిరించడం మొదలుపెట్టాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మోనాలిసా ఆత్మహత్య చేసుకోబోతోందని చెప్పాడు. ఆమె రాసిన లేఖలో యువకుడి పేరు, ఫోన్ నంబర్ ఉన్నాయని చెప్పి మరింత భయపెట్టాడు. పోలీసులు మీ ఇంటికి వస్తారు. వాళ్లతో పాటు మీడియా కూడా వస్తుంది. అంటూ ఒత్తిడి పెంచాడు. ఈ వ్యవహారం బయటకు వస్తే పరువు పోతుందన్న భయంతో యువకుడు నిందితుడు అడిగిన డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒక్కసారి కాదు.. విడతల వారీగా డబ్బులు చెల్లించాడు. అలా మొత్తం రూ.3.50 లక్షలు నిందితుడి చేతికి వెళ్లాయి. డబ్బులు తీసుకున్నంత వరకు ఫోన్ చేసిన వ్యక్తి.. ఆ తర్వాత మాత్రం కనిపించకుండా పోయాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అప్పుడే యువకుడికి అసలు అనుమానం వచ్చింది. తాను పోలీసుల భయంతో డబ్బులు ఇచ్చేశానని.. ఇదంతా మోసమని అర్థమైంది. ఆలస్యం చేయకుండా చిల్లకల్లు పోలీసులను ఆశ్రయించాడు.
ఇక్కడి నుంచే పోలీసుల దర్యాప్తు మొదలైంది. సాధారణ దర్యాప్తుతో సరిపెట్టకుండా సాంకేతిక ఆధారాలపై ఫోకస్ చేశారు. ఫోన్ కాల్స్.. సోషల్ మీడియా ఖాతాలు.. డబ్బుల లావాదేవీలు.. ఇలా ఒక్కో ఆధారాన్ని ట్రేస్ చేస్తూ వెళ్లారు. చివరకు సైబర్ నేరగాడి ఆచూకీ బయటపడింది. జగిత్యాలకు చెందిన కొలకాని అనిల్ ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.40 లక్షలు రికవరీ చేశారు. పోలీసుల దర్యాప్తులో.. అమ్మాయి పేరుతో సోషల్ మీడియా ఖాతా ఏర్పాటు చేసి పరిచయం పెంచుకోవడం.. ఆ తర్వాత పోలీస్ అధికారినంటూ భయపెట్టడం.. ఆత్మహత్య కేసు పేరుతో ఒత్తిడి చేయడం.. చివరకు డబ్బులు వసూలు చేయడం.. ఇదే నిందితుడి మోసం చేసిన విధానంగా గుర్తించారు.ఈ ఘటనతో సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలపై పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..