Prakasam: వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీలో అవకతవకలు.. విచారణలో విస్తుపోయే వాస్తవాలు
ప్రకాశం జిల్లా వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టింది..త్రిసభ్య కమిటీ. 2020లో చేపట్టిన నియామకాలకు సంబంధించి ఫైల్స్ కూడా కనిపించకపోవడంతో త్రిసభ్య కమిటీ సభ్యులు.. అధికారులను ప్రశ్నిస్తున్నారు. 2020 నుంచి జిల్లా వైద్యఆరోగ్యశాఖలో ఉద్యోగాలు పొంది జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల మెరిట్ జాబితా కానీ..ఏ ప్రాతిపదికన నియమించారన్న వివరాలు కానీ లేకపోవడంపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల భర్తీకి 2020లో నోటిఫికేషన్ ఇచ్చారు. వాస్తవానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి..అర్హతలను బట్టి మెరిట్ జాబితా రూపొందించాలి. ఆ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ అప్పట్లో పనిచేసిన అధికారులు..నిబంధనలకు విరుద్దంగా అడ్డగోలుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. దీని వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో చేపట్టి నియామకాలకు సంబంధించిన ఒక్క ఫైల్ కూడా ప్రస్తుతం కనిపించకపోవడం ఆ ఆరోపణలకు బలాన్నిస్తోంది.
అసలు ఎన్ని పోస్టులు భర్తీ చేశారన్న సమాచారం కూడా లేకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో 2020లో పోస్టింగ్‌లు ఇచ్చిన సమయంలో వైద్యారోగ్యశాఖలో పనిచేసిన ఉద్యోగులను వైద్యశాఖ కార్యాలయానికి పిలిపించారు. ఇప్పుడు వారంతా అప్పటి ఫైల్స్‌ను వెతకడం ప్రారంభించారు.
గతంలో ఇక్కడ పనిచేసిన ఏవోతోపాటు ఇతర ఉద్యోగులంతా ఫైల్స్‌ను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. కానీ ఒక్క రికార్డు కూడా కనిపించలేదని సమాచారం. ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక..ఉన్నతాధికారులకు నివేదక అందిస్తామని చెబుతున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..