మరణంలోనూ వీడని బంధం.. ఏడు పదుల వయసులో ఓకే రాత్రి వృద్ద దంపతుల మృతి!

ఏడు పదుల వయసులోనూ ఆ వృద్ధ దంపతులు ఒకరికి ఒకరుగా నిలిచారు. ఇద్దరు కూతుళ్లు అత్తారింటికి వెళ్లిపోతే.. కడుపున పుట్టిన కొడుకు కానరాకుండాపోయాడు. ఎవరూ తోడులేక.. అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఆ దంపతులకు మరణం ఓ వరంలా ఒకే రోజు పలకరించింది. తెల్లారేసరికి తమ ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉన్నారు..

మరణంలోనూ వీడని బంధం.. ఏడు పదుల వయసులో ఓకే రాత్రి వృద్ద దంపతుల మృతి!
Elderly Couple Died In Bapatla

Edited By:

Updated on: May 07, 2026 | 3:27 PM

బాపట్ల, మే 7: వాళ్ళిద్దరూ వృద్ద దంపతులు. ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తెల్లారేసరికి ఇద్దరూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. డెభ్భై ఏళ్ళ వయస్సులో ఎవరూ తోడు లేక, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆ దంపతులు హఠాత్తుగా రాత్రికి రాత్రే చనిపోయి పడి ఉండటం చూపరులను కలిచివేసింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఎటెళ్ళిపోయాడో తెలియదు. ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేసి అత్తారిళ్ళకు పంపించారు. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా జీవిస్తున్న ముదుసలి దంపతులకు కూతుళ్ళు, అల్లుళ్ళు ఆలనాపాలనా చూస్తున్నారు. అయితే అర్ధాంతరంగా రాత్రికి రాత్రే ఇద్దరూ ఒక్కసారే తనువులు చాలించడం బంధువులను శోకసంద్రంలో ముంచేసింది. బాపట్లజిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నం గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నం గ్రామంలో ఇనగాల మోహనరావు(70), పార్వతి(65) దంపతులు కాపురం ఉంటున్నారు. చేనేత కార్మికులుగా ఉన్న ఈ దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు సంతానం. చేనేత వృత్తి ద్వారా సంపాదించుకున్న ఆదాయంతోనే ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేశారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ముదిమి వయస్సులో ఉన్న తల్లిదండ్రులను ఆదరించాల్సిందిపోయి చెప్పాపెట్టకుండా పదేళ్ళ క్రితం ఎటో వెళ్ళిపోయాడు. ఇంత వరకు అతని ఆచూకీ దొరకలేదు. ఈ మధ్య కాలంలో పార్వతికి నడుముకు ఆపరేషన్‌ చేయడంతో ఆమె మంచానికే పరిమితమైంది. ఆమెకు భర్త మోహనరావు సపర్యలు చేస్తున్నారు.

వయస్సుపైబడటంతో కుమార్తెలు, అల్లుళ్ళు వీరి బాగోగులు చూస్తున్నారు. బంధువులు కూడా తమ సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో గత రాత్రి ఎప్పటిలాగే భోజనాలు చేసి పడుకున్న ఈ వృద్ద దంపతులు తెల్లారేసరికి విగతజీవులుగా చనిపోయి కనిపించారు. బాత్రూమ్‌లో మోహనరావు ఓ పక్కకు ఒరిగిపోయి చనిపోయి పడి ఉన్నారు. భార్య పార్వతి మంచంపైనే విగతజీవిగా చనిపోయి ఉంది. దీంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అశ్రునయనాల మధ్య ఇద్దరు దంపతులకు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us