Andhra: చూశారా ఈ చిత్రం.. ఇది కదా మాతృత్వం

అల్లూరి ఏజెన్సీలో ఆకట్టుకునే సంఘటన జరిగింది. ఓ తల్లి కుక్క మాతృత్వం చాటుతూ తమ పాలను మేక పిల్లలకు ఇచ్చి కడుపు నింపింది. ఈ అరుదైన ఘటన మల్లెపుట్టు గ్రామంలో జరిగింది. ఆ దృశ్యాలను గిరిజనులు ఆశ్చర్యంతో వీక్షించగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Andhra: చూశారా ఈ చిత్రం.. ఇది కదా మాతృత్వం
Viral Animal Video

Edited By: Ram Naramaneni

Updated on: Oct 10, 2025 | 10:08 PM

అల్లూరి ఏజెన్సీలో విచిత్రమైన దృశ్యం కనిపించింది… జాతి వైరాన్ని మరిచి ఓ కుక్క.. మేక పిల్లలకు పాల మాధుర్యాన్ని పంచింది. ఆకలితో ఆవురావురుమంటున్న మేక పిల్లలకు.. ఓ శునకం పాలిచ్చి మాతృత్వ మమకారాన్ని చాటింది. ఆకలితో ఉన్న మేక పిల్లలకు కడుపునిండా పాలు పెట్టి సాకింది ఆ తల్లి కుక్క. పెదబయలు మండలం మల్లెపుట్టు గ్రామంలో ఈ ఘటన. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

సహజంగా కుక్క, పిల్లి, కోతి, మేక, ఆవులు, పందులు వేర్వేరు జాతులు. ఒకదానితో మరొకటి కలిసి ఉండడం అంటే చాలా అరుదు. దాడులు చేసుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం ఆ మూగజీవాలు ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తూ కనిపిస్తాయి. కుక్కపాలను పిల్లి పిల్లలు, మేక పిల్లలు తాగిన అరుదైన ఘటనలు అనేక సార్లు చోటు చేసుకున్నాయి.

పెదబయలు మండలం మల్లెపుట్టులో ఓ గిరిజనుడికి చెందిన మేకలలో ఒక మేక పిల్లలను జన్మనిచ్చింది. అయితే.. తన తల్లి దగ్గర పాలు తాగి చెంగుచెంగున ఆడుకునే ఆ మేక పిల్లలు.. వింతగా ఓ కుక్కతోనూ కలిసుంటున్నాయి. దీంతో ఆ మేక పిల్లలను ఆప్యాయంగా సాకుతోంది ఆ తల్లి శునకం. అంతేకాదు.. ఆ మేక పిల్లలు ఆకలి వేసి పాల కోసం దగ్గరకు వస్తే… తన పాలను తాగిస్తోంది. అచ్చం.. తన పిల్లలకు పాలిచ్చినిట్లు.. ఆప్యాయంగా నాకుతూ, మేక పిల్లలకు కడుపునింపి ఆకలి తీరుస్తోంది శునకం. అంతేకాదు ఆ శునకం చుట్టూ చెంగుచెంగున గెంతుతూ మేక పిల్లలు ఆడుతుండడంతో గిరిజనులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఈ దృశ్యాన్ని అక్కడున్న గిరిజనులు వింతగా చూస్తున్నారు. మనుషుల్లోనే కాదు… మూగ జీవాల్లోనూ మాతృప్రేమ ఉంటుందని చర్చ జోరుగా నడుస్తోంది. కుక్క పాలు తాగే మేక పిల్లల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..