
ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ లాంటి యాప్స్ తరహాలో ప్రభుత్వం కొత్త క్విక్ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. వెబ్ సైట్, యాప్ ద్వారా రైతు బజార్ల నుంచి ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లు డెలివరీ చేయనుంది. ఇందుకోసం డిజి రైతు బజార్ అనే యాప్, వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. గతంలో విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ విధానాన్ని అమలు చేశారు. స్థానిక రైతు బజార్ల ద్వారా ప్రజలకు వెజిటెబుల్స్, పండ్లు డోర్ డెలివరీ చేశారు. అక్కడ సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇటీవల కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ప్రారంభించగా.. తాజగా విజయవాడలో కూడా సేవలను ప్రారంభించారు.
సమీపంలోని రైతు బజార్ నుంచి మీకు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ఇతర నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేస్తారు. రైతు బజార్ నుంచి 5 కిలోమీటర్ల రేడియస్‌లో డెలివరీ చేస్తారు. రైతు బజార్లు అన్నీ యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. మీ లొకేషన్ ఆధారంగా సమీపంలోని రైతు బజార్ కనిపిస్తుంది. ఆ రైతు బజార్‌లో ఎంత ధరలు ఉన్నాయో.. అవే ధరలు యాప్‌లో కనిపిస్తాయి. ఆ ధరలకు మీరు సరుకులు కొనుగోలు చేయొచ్చు. సాధారణంగా రైతు బజార్లలో తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో తక్కువ ధరలకు ప్రజలు కూరగాయలు, పండ్లు పొందవచ్చు. మాచింట్ సంస్థను డెలివరీ పార్ట్‌నల్‌గా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆ సంస్థ నేరుగా మీ ఇంటికే కొన్ని నిమిషాల్లోనే డెలివరీ చేస్తుంది. తాజా పండ్లు, వెజిటెబుల్స్‌ను మీరు పొందవచ్చు. రానున్న రోజుల్లో అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ యాప్ సేవలను ప్రభుత్వం విస్తరించేందుకు సిద్దమవుతోంది.
-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి డిజి రైతు బజార్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి
-మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వండి
-మీ లొకేషన్ యాక్సెస్ ఇవ్వండి
-రైతు బజార్‌ను ఎంచుకుని మీకు కావాల్సిన ప్రొడక్ట్స్‌ను యాడ్ చేయండి
-ఆ తర్వాత ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేయండి
-క్యాష్ ఆన్ డెలివరీ విధానం కూడా అందుబాటులో ఉంది
-కొన్ని నిమిషాల్లోనే మీకు డోర్ డెలివరీ చేస్తారు
-మినిమం రూ.100 విలువ చేసేవి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది
-రూ.100 మంచితే జీఎస్టీ, హ్యాడ్లింగ్, డెలివరీ ఛార్జీలు రూ.49 చెల్లించాల్సి ఉంటుంది.