
అర్నబ్ తుఫాన్ సృష్టించిన అల్లకల్లోలం నుంచి ఏపీ ఇంకా కోలుకోకముందే మరో తుఫాన్ భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి మరికొన్ని గంటల్లో తీవ్ర రూపం దాల్చబోతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుఫాన్‌కు మురసు అని నామకరణం చేసింది. ఈ మురసు తుఫాన్ ఏపీ వైపుగా దూసుకొస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నవంబర్ 2, 3 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు. ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందో మ్యాప్‌లో వివరించారు.
సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను తీర ప్రాంత ప్రజలు పాటించాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ ముంపు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. అటు.. మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది.
ఇదిలా ఉండగా మరో తుఫాన్ ముప్పుపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తుఫాన్ ముందస్తు చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ 2, 3, 4 తేదీల్లో ఏపీకి భారీ వర్ష సూచనతో ప్రతి ఆరు గంటలకు వాయుగుండం కదలికలను అంచనా వేయాలన్నారు. ఉపగ్రహచిత్రాలు, డాప్లర్ రాడార్లతో నిరంతరం తుఫాన్ పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. అర్నబ్ తరహాలోనే మురసును ఎదుర్కొని ప్రజలకు భరోసానివ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
మరోవైపు.. తుఫాన్ హెచ్చరికలపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన జారీ చేశారు. రేపు ఏపీ తీరానికి తుఫాన్ సమీపించే అవకాశం ఉండటంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, NTR, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులు అప్రమత్తంగాఉండాలన్నారు.
పంటల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువలు సిద్ధం చేయాలని.. కోత పూర్తయిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండటంతో పాటు.. రైతులకు అన్ని విధాలా భరోసా ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా.. అర్నబ్ తుఫాన్ బీభత్సం నుంచి తేరుకోకముందే మురసు ముప్పు ముంచుకొస్తుండటం ఏపీని భయపెడుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.