జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి.. మహిళల ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్.. కట్ చేస్తే..!

బాపట్ల జిల్లాలో మహిళలను బెదిరిస్తూ, డబ్బుల కోసం వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఓ ఆటో డ్రైవర్‌పై బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. బాపట్ల జిల్లా కేంద్రానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి తన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మహిళలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనప్పటికీ వేధింపులు ఆగలేదని బాధితులు వాపోయారు.

జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి.. మహిళల ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్.. కట్ చేస్తే..!
Auto Driver Threatening Women
Image Credit source: AI Representative Image

Edited By:

Updated on: Jul 14, 2026 | 5:26 PM

బాపట్ల జిల్లాలో మహిళలను బెదిరిస్తూ, డబ్బుల కోసం వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఓ ఆటో డ్రైవర్‌పై బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. బాపట్ల జిల్లా కేంద్రానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి తన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మహిళలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనప్పటికీ వేధింపులు ఆగలేదని బాధితులు వాపోయారు.

బాధితుల కథనం ప్రకారం, రాజేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ రోజూ మహిళా కూలీలను పనికి తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం చేసేవాడు. ఈ క్రమంలో కొందరు మహిళలతో సన్నిహిత పరిచయం పెంచుకున్నాడు. ఆటోలో ప్రయాణించే సమయంలో వారితో మాట్లాడిన మాటలను రహస్యంగా రికార్డు చేయడంతో పాటు, చనువుగా ఉన్న సందర్భాల్లో ఫోటోలు, వీడియోలు కూడా తీశాడని వారు ఆరోపించారు. అనంతరం ఆ ఫోటోలు, వీడియోలను బయటపెడతానంటూ ఇద్దరు మహిళలను బెదిరించి వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు.

ఈ వేధింపులు భరించలేక బాధిత మహిళలు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయగా, రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా, మరింత దూకుడుగా వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల వాదన ప్రకారం, అతని వేధింపులను తట్టుకోలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ విషయం బయటకు రాలేదని తెలిపారు.

వేధింపులు పెరగడంతో ఇద్దరు మహిళలు బాపట్లను విడిచి దుగ్గిరాల మండలం పేరికలపూడికి వెళ్లి నివసించడం ప్రారంభించారు. అయినప్పటికీ వారి ఆచూకీ తెలుసుకున్న రాజేష్ అక్కడికీ వెళ్లి బెదిరించినట్లు ఆరోపించారు. భయంతో రూ.20 వేల నగదు ఇచ్చి తమ ఫోటోలు, వీడియోలు బయట పెట్టవద్దని వేడుకున్నామని, ఇకపై తమ వద్దకు రావద్దని కోరినా అతను తరచూ వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడని చెప్పారు. డబ్బులు ఇవ్వలేకపోతే ఆస్తులు తన పేరుపై రాయాలని కూడా ఒత్తిడి తెచ్చాడని బాధితులు పేర్కొన్నారు.

తీవ్ర ఆందోళనకు గురైన మహిళలు చివరకు తమ కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని వెల్లడించారు. గ్రామ పెద్దల సలహా మేరకు గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాజేష్‌పై ఇప్పటికే రౌడీషీట్‌తో పాటు పోక్సో కేసు కూడా ఉందని, బాపట్ల, నిజాంపట్నం, చెరుకుపల్లి, తెనాలి, చందోలు పోలీస్ స్టేషన్లలో వివిధ కేసులు నమోదై ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ నిర్వహించి, మహిళలను వేధిస్తున్న నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదును స్వీకరించి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి..

Follow Us