స్థానిక ఎన్నికల్లో కూటమి సునామీ.. సుపరిపాలనతోనే ప్రజల ఆదరణ పెరుగుతోంది: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై సీఎం చంద్రబాబు వివరాలు వెల్లడించారు. 2024 ఎన్నికల్లో 55.3 శాతంగా ఉన్న కూటమి ఓట్ల వాటా తాజా స్థానిక ఎన్నికల్లో 58.90 శాతానికి పెరిగిందన్నారు. వైసీపీ ఓట్ల శాతం 39.81 నుంచి 33.56కు తగ్గిందని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ కూటమికి ప్రజల మద్దతు లభించిందని పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి సునామీ.. సుపరిపాలనతోనే ప్రజల ఆదరణ పెరుగుతోంది: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

Updated on: Nov 09, 2026 | 1:22 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల ఫలితాలు, ఓట్ల శాతాలు, కూటమి సాధించిన ఘన విజయాలపై వివరాలను వెల్లడించారు. సుపరిపాలనకే ప్రజలు పట్టం కట్టారని, రాష్ట్రంలో కూటమి ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 55.3 శాతం ఓట్లు రాగా, తాజా స్థానిక ఎన్నికల నాటికి అది 58.90 శాతానికి పెరిగిందని.. కూటమి ఓట్ల శాతంలో 3.6% వృద్ధి నమోదైందని సీఎం చంద్రబాబు తెలిపారు.. గతంలో 39.81 శాతంగా ఉన్న వైసీపీ ఓట్ల శాతం ఏకంగా 33.56 శాతానికి పడిపోయిందని తెలిపారు. గతంతో పోలిస్తే 6.25% తగ్గుదల ఉందన్నారు. 2024లో కూటమి, వైసీపీ మధ్య 15.9 శాతంగా ఉన్న ఓట్ల తేడా, ఇప్పుడు ఏకంగా 25.34 శాతానికి పెరిగిపోయిందన్నారు..

మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో కూటమి ఏకంగా 94 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేశామని..సీఎం వివరించారు. పట్టణ ప్రాంతాల్లో కూటమికి  59.9%, వైసీపీకి 34.3% ఓట్లు వచ్చి.. ఇరు పార్టీల మధ్య 25.60% వ్యత్యాసం నమోదైందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి 57.6%, వైసీపీ 39.7% ఓట్లు సాధించాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కూటమి 87.5 శాతం స్ట్రైక్ రేట్తో సత్తా చాటిందన్నారు. మొత్తం 9,818 ఎంపీటీసీ స్థానాలకు గాను 7,803 స్థానాల ఫలితాలు వెలువడగా, మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో 90 శాతానికి పైగా కూటమి కైవసం చేసుకుందని.. 659 డిప్యూటీ ఎంపీపీ స్థానాలకు గాను కూటమికి 575 స్థానాలు దక్కాయని తెలిపారు.

రాష్ట్రంలోని 28 జిల్లాల్లో.. అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించిందని చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీకి కనీసం ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి..  అఖండ ఆధిక్యం కనబరిచిందని చంద్రబాబు తెలిపారు.

తుపాను కష్టాల సమయంలోనూ ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇచ్చిందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గుర్తించి మద్దతుగా నిలిచారని సీఎం చంద్రబాబు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us