
భాగస్వాములంటే విభేదాలు ఉంటాయని, కానీ రెండున్నరేళ్లుగా తమ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో 31వ CII సదస్సును కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో TDP, జనసేన, BJP మధ్య నమ్మకమైన భాగస్వామ్యం ఉందని తెలిపారు. తన నాయకత్వంలో ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు CII సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఆతిధ్యమిచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.
తిరుపతి డిజైన్లను అంతర్జాతీయ రాజధానిగా నిలుపుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. చైనా తర్వాత భారత్‌లో సాంకేతిక వనరులు చాలా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ మూల పారిశ్రామీకరణ జరుగుతోందని వెల్లడించారు. ప్రతీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ ఎంతో బలంగా ఉందని తెలిపారు. కాలం కంటే ముందుకు వెళ్లాలని, తాను భవిష్యత్ గురించి ఆలోచన చేస్తున్నానని చంద్రబాబు అన్నారు.
కట్టప్పలతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మేధో సంపద హక్కులను భారత్ గౌరవిస్తుందని, టెక్నాలజీని దొంగిలించదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మీకు చెందింది ఎప్పటికీ మీకే ఉంటుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఒడిదొడుకుల్లో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఒక ఓయాసిస్‌లా నిలుస్తుందని తెలిపారు. బహిరంగ మార్కెట్లు, సామర్ధ్యం, విశ్వసనీయతను భారత్ అందిస్తుందని గోయల్ వెల్లడించారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆలోచనలు, పెట్టుబడులు,అంతర్జాతీయ భాగస్వామ్యాలకు వేదికగా విశాఖపట్నం నిలుస్తోందని అన్నారు. భవిష్యత్తు గురించి ఇక్కడ చర్చించడం లేదని, ఇక్కడ భవిష్యత్తును నిర్మిస్తున్నామని తెలిపారు. వ్యాపారాలకు కావాల్సింది నమ్మకమని అన్నారు. నిబద్ధత, స్థిరత్వం, భాగస్వామ్యాలతో ఆ నమ్మకం రూపుదిద్దుకుంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.
ఆ తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్మాయుడు మాట్లాడుతూ.. ఊహించని దానికంటే వేగంగా మారుతున్న టెక్నాలజీలో వ్యాపారం, టెక్నాలజీ మాత్రమే సరిపోదని.. ప్రపంచానికి కావాల్సింది దేశాల మధ్య నమ్మకం, పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య విశ్వాసం, అనిశ్చితిని అవకాశాలుగా మార్చే నాయకత్వం అవసరమని అన్నారు. ప్రపంచం ఎకనామిక్స్‌ను చూసిందని, ఆ వృద్ధిలో భారత్ మోదీనామిక్స్ను చూస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
రాష్ట్రంలో భవిష్యత్ నిర్మాణం జరుగుతోందని, పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన మౌలికసదుపాయాలు, మానవవనరులు పుష్కలంగా ఉన్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. రాజకీయనాయకత్వంతో పాటు పరిపాలన నాయకత్వాన్ని కలుసుకునే వెసులుబాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.
దేశ విదేశీ పెట్టుబడడులు ఆకర్షించేందుకు పెట్టుబడిదారుల సంరక్షణ చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. చాలా మంది పెట్టుబడిదారులు పెట్టుబడుదల రక్షణ గురించి తనతో మాట్లాడారని లోకేష్ తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆశీస్సులతో దాన్ని కేంద్రానికి పంపించి జాతీయస్థాయిలో కూడా ఆ చట్టం అమలయ్యేలా చూస్తామని అన్నారు.
ఇక మంత్రి లోకేశ్‌ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కొనియాడారు. విజయగాథలను అమలు చేసే వ్యక్తి, ప్రత్యేక శైలి, విషయం ఉన్న వ్యక్తే కాదు ఫలితాలను రాబట్టే నాయకుడని ప్రశంసించారు. విశాఖలో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే CII సదస్సులకు ఇక శాశ్వత వేదికగా విశాఖపట్నం నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.