ఆ సీఐ నోటి దురుసు! వృద్ధ మహిళపై అసభ్యకర పదజాలం.. వైరల్‌గా మారిన వీడియో

Chirala CI Misconduct: బాపట్ల జిల్లా చీరాల సీఐ శశికమార్ కార్డన్ సెర్చ్‌లో వృద్ధురాలితో అసభ్యంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీసీటీవీ దృశ్యాలు వైరల్ కావడంతో పోలీసుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇలా దురుసుగా వ్యవహరించడం చట్ట విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన. ఇలాంటి ఘటనలపై ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

ఆ సీఐ నోటి దురుసు! వృద్ధ మహిళపై అసభ్యకర పదజాలం.. వైరల్‌గా మారిన వీడియో
Chirala Ci Misconduct

Edited By:

Updated on: Sep 07, 2026 | 6:21 PM

బాపట్ల జిల్లా చీరాల టూటౌన్ సీఐ శశికుమార్ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తూ ఓ ఇంటి బయట వృద్ధురాలితో అసభ్యంగా ప్రవర్తించడం, దూషించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. సీసీ కెమెరాలో నమోదైన ఈ దశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌చల్‌ చేస్తున్నాయి. చట్టప్రకారం, నైతికంగా ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు.

బాపట్ల జిల్లా చీరాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామ్‌నగర్‌లో తాజాగా చోటుచేసుకున్న ఘటన పోలీసు శాఖ ప్రతిష్టపై మరోసారి చర్చకు దారితీసింది. ఎస్‌టీ ఎరుకల సామాజిక వర్గానికి చెందిన ఓ వృద్ధ మహిళతో రెండో పట్టణ సీఐ శశికుమార్‌ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 6వ తేదిన ఆదివారం కార్డన్‌ సెర్చ్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వైరల్‌గా మారిన వీడియోలో సీఐ శశికుమార్‌ వృద్ధ మహిళతో దురుసుగా మాట్లాడుతున్న దృశ్యాలు, అభ్యంతరకరమైన పదజాలంతో సంభాషిస్తున్నట్లు కనిపించే, వినిపించే దృశ్యాలు పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజలలో మరింత అపనమ్మకాన్ని కలిగించేలా ఉన్నాయి. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం పేరుతో కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉంటోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి ఒక వృద్ధ మహిళతో దురుసుగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.

చట్టం ఏం చెబుతోంది..?

పోలీస్‌శాఖ శాంతిభద్రతల పరిరక్షణ కోసం కార్డన్ సెర్చ్ లు నిర్వహించే హక్కు ఉన్నప్పటికీ, ఆ సమయంలో పౌరుల, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించే అధికారం ఏ చట్టం ఇవ్వలేదు. పోలీసు నియమావళి ప్రకారం ప్రజలతో, ముఖ్యంగా బలహీన వర్గాలు, వృద్ధులతో సంయమనంతో, గౌరవప్రదంగా వ్యవహరించాలి. డ్యూటీలో ఉండి కూడా దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించిన అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలపై బాపట్ల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ లేదా ఇతర ఉన్నతాధికారులకు సాక్ష్యాలతో కూడిన వీడియో, లేదా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసి న్యాయం కోరవచ్చు. పోలీసులు బూతులు తిట్టడం లేదా అసభ్య పదజాలం ఉపయోగించడం చట్టప్రకారం, నైతికంగా ఏమాత్రం సరైనది కాదు. భారత రాజ్యాంగం, చట్టాలు పౌరుల ఆత్మగౌరవానికి రక్షణ కల్పిస్తాయి. నిందితులతో లేదా సామాన్య ప్రజలతో మాట్లాడేటప్పుడు పోలీసులు గౌరవప్రదంగా ప్రవర్తించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

పోలీస్ మాన్యువల్, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, డ్యూటీలో ఉన్న ఏ పోలీస్ అధికారి కూడా పౌరులను దూషించడం, అవమానించడం చేయకూడదు. ఎవరైనా వ్యక్తిని పబ్లిక్‌గా బూతులు తిడితే లేదా అవమానిస్తే భారతీయ న్యాయ సంహిత, ఇతర నిబంధనల ప్రకారం అది నేరంగా పరిగణించబడుతుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారిని లేదా రోడ్డుపై వెళ్లే వాహనదారులను బూతులు తిట్టడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఒకవేళ పోలీసులు అలా ప్రవర్తిస్తే సదరు పోలీస్ అధికారిపై ఉన్నత అధికారులు డిఎస్‌పి, ఎస్‌పికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us