Nagarjuna Sagar: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసుల కేసు.. నాగార్జునసాగర్‌ వివాదంపై కేంద్రం ఆరా..

Nagarjunasagar project dispute: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌పై యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతోంది. అటు ఆంధ్రా పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులూ ఇరువైపులా పెద్దఎత్తున మోహరించారు. వందలాదిమంది పోలీసులను రంగంలోకి దింపాయి రెండు రాష్ట్రాలు. 13 గేట్లను కంట్రోల్‌కి తీసుకున్న ఏపీ పోలీసులు... సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.

Nagarjuna Sagar: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసుల కేసు.. నాగార్జునసాగర్‌ వివాదంపై కేంద్రం ఆరా..
Nagarjuna Sagar

Updated on: Dec 01, 2023 | 1:06 PM

Nagarjuna Sagar project dispute: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌పై యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతోంది. అటు ఆంధ్రా పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులూ ఇరువైపులా పెద్దఎత్తున మోహరించారు. వందలాదిమంది పోలీసులను రంగంలోకి దింపాయి రెండు రాష్ట్రాలు. 13 గేట్లను కంట్రోల్‌కి తీసుకున్న ఏపీ పోలీసులు… సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ పోలీసులు కూడా యాక్షన్‌లోకి దిగారు. 13వ గేటు దగ్గర బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే, ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో నాగార్జునసాగర్‌పై యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. 13వ గేట్‌ నుంచి 26వ గేట్‌ వరకు స్వాధీనం చేసుకుంది ఏపీ. వేలాది మంది ఆర్మ్‌డ్‌ పోలీసులను రంగంలోకి దింపి… 13వ గేటు దగ్గర బారికేడ్లు, ఇనుక ముళ్ల కంచెను వేసింది. దాంతో, ఏపీ చర్యలపై కృష్ణా బోర్డుకు కంప్లైంట్‌ చేసింది తెలంగాణ.

సాగర్‌పై పరిస్థితిని సమీక్షిస్తున్నారు తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులు. తెలంగాణ ఈఎన్‌సీ హరిరామ్‌తోపాటు నలుగురు సీఈలు డ్యామ్‌పైకి వెళ్లారు. అక్కడ్నుంచే కేంద్ర జలశక్తి సంఘంతో వీడియో కాన్ఫరెన్స్‌లో సంప్రదింపులు జరిపారు. మరికాసేపట్లో సాగర్‌ ప్రాజెక్ట్‌ దగ్గరకు రానున్నారు తెలంగాణ ఇరిగేషన్‌శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌.. తెలంగాణ ఫిర్యాదుతో నాగార్జునసాగర్‌ వివాదంపై ఆరా తీసింది కేంద్రం. సాగర్‌ దగ్గర పరిస్థితులను తెలుసుకోవడానికి సీడబ్ల్యూసీ రంగంలోకి దిగింది. మరోవైపు, కృష్ణా రివర్‌ బోర్డు సభ్యులు కూడా డ్యామ్‌ దగ్గరకు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఏపీ పోలీసులపై కేసు నమోదు..

నాగార్జున సాగర్‌లో 13 గేట్లు ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై కేసు నమోదయ్యింది. ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసుల FIR నమోదు చేశారు. నాగార్జున సాగర్‌ విజయపురి టౌన్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందులో A-1గా ఏపీ పోలీస్‌ ఫోర్స్‌ను పేర్కొంటూ వివరించారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని.. తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఫిర్యాదు చేసింది. 500 మంది సాయుధ బలగాలతో.. సాగర్‌ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు వచ్చారంటూ ఫిర్యాదు చేశారు. ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకూ.. ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. కుడికాల్వ 5వ గేటు నుంచి ఏపీకి నీళ్లు వదిలారని.. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా..అక్రమంగా నీటిని వదిలారంటూ తెలంగాణ పోలీసుల ఫిర్యాదు చేశారు. దీనిపై 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

చట్ట ప్రకారమే వెళ్లాం.. అంబటి రాంబాబు..

దీనిపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. మా వాటా నీళ్లను ధర్మబద్ధంగా మేం తీసుకుంటే అభ్యంతరమేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం 13 గేటు వరకు ఉన్న భూభాగం ఏపీదేనని, గత ప్రభుత్వం చేతకాని తనం వల్ల దాన్ని తెలంగాణ ఆక్రమించిందని ఆరోపించారు. ఏపీ భూభాగంలో తెలంగాణ పోలీసుల చెక్ పోస్టులు పెడితే ఎందుకు ఊరుకోవాలన్నారు. చట్ట ప్రకారమే మా భూభాగంలోకి మేం వెళ్లి మాకు రావాల్సిన నీటిని మేం విడుదల చేసుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలతో తమకెలాంటి సంబంధం లేదని, అక్కడ ఎవరి ప్రభుత్వం వచ్చినా వారితో సత్సంబంధాలు నెరపడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏ ప్రభుత్వమైనా ఏపీ హక్కుల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అంబటి తేల్చి చెప్పారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..