Snake Video: కోనసీమలో 70 ఏళ్ల నాగు.. నిజంగా పాము అన్నేళ్లు బ్రతుకుతుందా..?

అడవుల్లో ఉండాల్సిన పాములు చలి–వర్షాల కారణంగా వెచ్చదనం కోసం జనావాసాల్లోకి చేరుతున్నాయి. కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువులోనూ ఇలాంటి ఘటనే నమోదైంది. గడ్డివాము వద్ద గడ్డి లాగుతుండగా అకస్మాత్తుగా ప్రత్యక్షమైన నల్లత్రాచుపాము స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. .. ..

Snake Video: కోనసీమలో 70 ఏళ్ల నాగు.. నిజంగా పాము అన్నేళ్లు బ్రతుకుతుందా..?
Cobra

Updated on: Dec 02, 2025 | 7:28 PM

ఓవైపు చలి, మరోవైపు వర్షాలతో అడవుల్లో ఉండాల్సిన పాములు వెచ్చదనం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కోసారి పాముకాట్లకు గురైన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ నల్లత్రాచుపాము జనాలను పరుగులు పెట్టించింది.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల్‌ చెరువు గ్రామంలో నల్లత్రాచుపాము స్థానికులను పరుగులు పెట్టించింది. బొక్కా చందర్‌రావు ఇంటి సమీపంలోని గడ్డివామువద్దకు పశువులకు వేయడానికి గడ్డి లాగుతుండగా వింత శబ్ధాలు వినిపించాయి. మొదట లైట్‌ తీసుకున్న చందర్‌రావు గడ్డిలాగుతూ ఉన్నారు. ఇంతలో గడ్డిలో ఏదో కదిలినట్టు కనిపించింది. వెంటనే దూరం జరిగి పరిశీలించగా ఓ నల్లత్రాచుపాము ముందుకు వచ్చింది. వెంటనే అక్కడినుంచి ఇంటివైపు పరుగెత్తాడు చంద్రరావు. చుట్టుపక్కలవారికి విషయం తెలియడంతో అందరూ అక్కడ గుమిగూడారు. కొందరు స్థానిక స్నేక్‌ క్యాచర్‌ గణేష్‌ వర్మకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న వర్మ ఎంతో చాకచక్యంగా ప్రమాదరకరమైన ఆ నల్లత్రాచును బడ్డాలో బంధించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలను స్థానిక వ్యక్తి వీడియో తీశారు. వీడియోలో నల్లత్రాచు పడగవిప్పుతూ.. బుసలుకొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. శీతాకాలంలో వచ్చదనం కోసం పాములు గడ్డివాముల్లో చేరుతుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్నేక్‌ క్యాచర్‌ గణేష్‌ తెలిపాడు. అయితే ఈ పాముకు 70 ఏళ్లు ఉండొచ్చని స్నేక్ క్యాచర్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

నాగుపాముల సహజ ఆయుష్షు 15–25 సంవత్సరాలు మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అవి సేఫ్ కండిషన్స్‌ ఉంటే కూడా 25–30 సంవత్సరాలు దాటిన రికార్డులు లేవు. పాముల శారీరక నిర్మాణం, జీవక్రియ, ప్రకృతిలోని ప్రమాదాలు.. ఇవన్నీ ఎక్కువ ఆయుష్షుకు అనుకూలంగా ఉండదు. 70 ఏళ్లు నాగుపాములు బతికే అవకాశాలే ఉండవు. ఒకే ప్రాంతానికి తరతరాలుగా వచ్చే పాములను అదే పాముగా భావిస్తూ ఉంటారు. భారత కోబ్రా లైఫ్ స్పాన్ 25–28 సంవత్సరాలు. కాబట్టి నాగుపాము 70 సంవత్సరాలు బ్రతకడం శాస్త్రీయంగా అసాధ్యం.