పశ్చిమగోదావరి, ఆగస్టు 22: శ్రావణ మాసం కావడంతో చాలా ఇళ్లలో పెళ్లి సందడి నెలకొంది. బంధువులు, మిత్రులను పెళ్లిళ్లకు ఆహ్వానించేందుకు వధువు తరపు వారు, వరుడి తరపు వారు యమ బిజిబిజీగా ఉన్నారు. సాధారణంగా పెళ్లికి ఆహ్వానించేందుకు బంధుమిత్రులకు పెళ్లికార్డులు ఇవ్వడం పరిపాటి. కార్డు ఇవ్వగానే పెళ్లి ఎప్పుడు, ముహూర్తం ఎన్నింటికి అనే విషయాలు చూస్తారు… అవునా? కానీ ఈ జంట పెళ్లిపత్రిక చూసిన వారంతా అందుకు భిన్నంగా ‘మాకెన్ని మార్కులు వచ్చాయి..’ అని అనడుగుతారు. అదేంటి అని అలోచిస్తున్నారా? ఈ విచిత్ర పెళ్లి పత్రిక గోదారోళ్లది మరి. ఏమాట కామట చెప్పుకోవాలి. గోదారోళ్లకి కాస్త వెటకారం ఎక్కువేనండోయ్.. ఆ కథేంటో మీరే తెలుసుకోండి..
పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన ప్రత్యూష అనే యువతి వృత్తిరిత్యా టీచర్. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. అక్కడే పరిచయమైన ఫణీంద్ర అనే తోటి ప్రొఫెసర్‌తో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఎంతైన టీచరమ్మ కదా.. విద్యార్థుల భవిష్యత్తును, వారిలోని సృజనాత్మకతను తీర్చిదిద్దే ఆమె పెళ్లికి విచ్చేసే అతిథులకు కూడా ఓ పరీక్ష పెట్టింది. క్వశ్చన్ పేపర్ వేరెవ్వరో కాదు.. స్వయంగా ఆమెనే సెట్ చేసింది. అయితే ప్రశ్నలన్నీ పెళ్లి పత్రికలోనే నింపేసింది. ప్రత్యూష తన పెళ్లికి బంధుజనాన్ని పిలిచేందుకు ఇంటికి వెళ్లి సదరు ప్రశ్నాపత్రం.. కాదు కాదు పెళ్లిపత్రికను అందించింది. ముందుగా చెప్పుకున్నట్లు.. చేతిలో పెట్టిన పెళ్లి పత్రికను తెరచిన బంధువులు పెళ్లెప్పుడు, ఎక్కడ అనే వివరాలు తెలుసుకోవడానికి గబగబా తెరచి చూశారు. అయితే లోపల ఆ వివరాలకు బదులు క్వశ్చన్ పేపర్ ఉండటం చూసి.. టీచర్ కదా పెళ్లి హడావిడిలో పిల్లల క్వశ్చన్ పేపర్ పెట్టినట్లు ఉందని అనుకున్నారు. అదే పెళ్లిపత్రిక అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.
ఎంతైనా పంతులమ్మ కదా! తన పెళ్లికార్డు విషయంలోనూ కాస్త సృజనాత్మకత జోడించి, తన వృత్తికి దగ్గరగా ఉండేలా వెడ్డింగ్ కార్డును డిజైన్ చేసింది. అందుకే పెళ్లి వివరాలతో ఓ ప్రశ్నపత్రాన్ని రూపొందించింది. అన్నీ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే. సరైన సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. దానిలో ప్రశ్న- సమాధానం, స్పెల్లింగ్ సరిచేయడం, బహుళైచ్ఛిక ప్రశ్న, తప్పు-ఒప్పు… ఇలా భిన్నవిధానాల్లో మొత్తం 8 ప్రశ్నలను సమాధానాలతో సహా సిద్ధం చేశారు. అందులో వరుడు, వధువు పేర్లు, కన్యాదానం చేసే వారి పేర్లు, పెళ్లి తేదీ, ముహూర్తం, వేదిక, విందుకు సంబంధించిన వివరాలన్నీ ప్రశ్న-జవాబుల్లోనే వచ్చేలా ముద్రించారు. ఈ విచిత్ర ఆహ్వాన పత్రిక చూసిన బంధుజనలంతా మొదట ఆశ్చర్యపోయినా… ఆమె ఆలోచనను మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పంతులమ్మ పెళ్లికార్డు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరూ చూసేయండి..