
ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను అధికారులు సవరించారు. ప్రస్తుతం ఏపీలో సర్వీసులు అందిస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లోని ఛార్జీలు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో కంటే ఎక్కువగా ఉన్నాయి. దూరాన్ని బట్టి రూ.20 నుంచి రూ.130 వరకు అధికంగా ఉన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల బస్సుల్లో ఛార్జీలు ఒకేలా ఉండేలా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులతో సమానంగా టీజీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను సవరించారు. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో వీటిని సవరించాలని పలుమార్లు ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రయాణికుల డిమాండ్ మేరకు ఛార్జీలను సవరించినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఏపీ, తెలంగాణ బస్సుల్లో ఛార్జీలు వేర్వేర్వుగా ఉండటం, టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా ఉండటంతో అధికారులు సవరణలు చేపట్టారు. ఆర్టీసీ ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు. అయితే ఏపీ మీదుగా తెలంగాణ ఆర్టీసీకి చెందిన వేలాది బస్సులు తరచుగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో సమానంగా వాటిల్లో ఛార్జీలు ఉండేలా టారిఫ్‌ల్లో సవరణలు చేశారు. అటు ఈ సందర్బంగా ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు మరో కీలక ప్రకటన చేశారు. ఉచిత బస్సు ప్రయాణం అమలువుతున్న బస్సుల్లో వృద్దులు, దివ్యాంగులకు కేటాయించిన సీట్లను వారికే అప్పగించాలని, మహిళలు కూర్చోవద్దని అధికారులు సూచిస్తున్నారు. వారికి కేటాయించిన ప్రత్యేక సీట్లలో వారు మాత్రమే కూర్చునేలా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
అన్ రిజర్వుడ్ బస్సుల్లో వృద్దులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా రెండు సీట్లు చొప్పున రిజర్వ్ చేసి ఉంటాయి. అయితే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. దీని వల్ల బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల మహిళలు బస్సుల్లోని సీట్లన్నీ కబ్జా చేస్తున్నారు. వృద్దులు, దివ్యాంగులకు రిజర్వ్ చేసిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారు. దీంతో బస్సుల్లో ప్రయాణికుల మధ్య తరచూ వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలుమార్లు ఈ విషయంపై ఆర్టీసీ అధికారులకు ప్రయాణికుల నుంచి ఫిర్యాదు అందాయి. దీంతో అధికారులు స్పందించి.. తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరికి కేటాయించిన సీట్లల్లో వాళ్లు మాత్రమే కూర్చునేలా ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టాలని, ఈ మేరకు కండక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించింది. వేరేవాళ్లు కూర్చుంటే వారిని ఖాళీ చేయించాలని ఆదేశించింది. దీని వల్ల ప్రయాణికుల మధ్య గొడవలు ఉండవని అధికారులు తెలిపారు.