
ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం ప్రారంభమైంది.. మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.. తొలి దశకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వాస్తవానికి, స్థానిక సంస్థల ఎన్నికలంటేనే ఎన్నో ఆసక్తికర పరిణామాలు, విచిత్రమైన నిర్ణయాలు చూస్తుంటాం.. కానీ అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రామాలయం నిర్మాణం కోసం.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో రామాలయం నిర్మించాలనే సంకల్పంతో.. సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులంతా ఏకాభిప్రాయంతో ఈ వేలం ప్రక్రియను చేపట్టారు. ఈ వేలంలో ఆదినారాయణ అనే ఆశావాహుడు అందరికంటే ఎక్కువగా ఏకంగా 29 లక్షల రూపాయలకు పాట పాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. ఆలయ నిర్మాణం కోసమే గ్రామస్థులంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమచారం.. సర్పంచ్ పదవికి 29 లక్షల రూపాయలు పలకడం ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే, శింగనమల నియోజకవర్గం పరవల్లి ఎంపీటీసీ స్థానంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పరవల్లికి చెందిన తిరుపాలమ్మ అనే మహిళకు కేవలం అర సెంటు స్థలం విషయంలో వివాదం ఉంది. తన సమస్యను పరిష్కరించాలంటూ ఆమె ఎంతో కాలంగా అధికారులు, స్థానిక నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో తన సమస్యను తానే పరిష్కరించుకోవాలనే పట్టుదలతో తిరుపాలమ్మ నేరుగా ఎంపీటీసీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. శింగనమల మండల పరిషత్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఏడుగురు సభ్యుల మెజారిటీ అవసరం కాగా.. ఎన్నికల్లో టీడీపీ ఆరు స్థానాలు, వైసీపీ ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో పరవల్లి ఎంపీటీసీగా గెలిచిన తిరుపాలమ్మ మద్దతు ఇప్పుడు ఇరు పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. తన అర సెంటు స్థలం వివాదాన్ని ఎవరు పరిష్కరిస్తే వారికే తన మద్దతు ఉంటుందని తిరుపాలమ్మ స్పష్టం చేస్తుండటంతో.. మండల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది..
మొత్తానికి ఒక చోట ఆలయ నిర్మాణం కోసం పదవికి వేలం పాట.. మరో చోట అర సెంటు స్థలం కోసం ఏకంగా కింగ్ మేకర్‌గా మారిన వైనం.. అనంతపురం జిల్లా స్థానిక ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.