
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కూటమి.. తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే జోరును కొనసాగించింది. రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న పరిషత్ ఎన్నికల ఫలితాలు కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుండగా.. వైసీపీకి మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా జడ్పీ పీఠాల విషయంలో 28 జిల్లాలకు గానూ 27 జిల్లాల్లో కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అల్లూరి జిల్లాలో మాత్రమే వైసీపీకి జడ్పీ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జడ్పీటీసీల్లో కూటమి హవా!
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. వీటిలో 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 77 ఏకగ్రీవాలతో కలిపి 611 స్థానాల ఫలితాలు ప్రకటించారు. తాజాగా ప్రకటించిన ఫలితాల ప్రకారం కూటమి ఏకంగా 473 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో తెలుగుదేశం పార్టీ 384 స్థానాల్లో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. జనసేన పార్టీ 70 స్థానాలను, బీజేపీ 19 స్థానాలను దక్కించుకున్నాయి. మరోవైపు వైసీపీ కేవలం 57 జడ్పీటీసీ స్థానాలకే పరిమితమైంది. నాలుగు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఇంకా 48 స్థానాలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఈ లెక్కలు చూస్తే జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ఎంతటి ఆధిక్యాన్ని ప్రదర్శించిందో అర్థమవుతోంది.
ఎంపీటీసీల్లోనూ కూటమి ప్రభంజనం!
జడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 2,051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 7,767 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2,051 ఏకగ్రీవాలతో కలిపి 9,640 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. మిగిలిన ఫలితాలను కూడా వెల్లడించే ప్రక్రియ కొనసాగింది. మూడు స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ప్రకటించిన ఫలితాల ప్రకారం కూటమి అభ్యర్థులు 5,819 స్థానాల్లో విజయం సాధించారు. ఇందులో టీడీపీ అత్యధికంగా 4,754 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన 945 స్థానాల్లో, బీజేపీ 120 స్థానాల్లో గెలుపొందాయి. ఇక వైసీపీకి 1,583 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 187 స్థానాల్లో విజయం సాధించారు. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ తన బలాన్ని నిరూపించుకోవడంతో పాటు జనసేన, బీజేపీ కూడా తమ ఉనికిని చాటుకున్నాయి.
95 శాతం వరకు ఫలితాల ప్రకటన!
గురువారం (నంబర్ 05) జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం (నవంబర్ 07) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే కూటమి అభ్యర్థులకు అనుకూల ఫలితాలు కనిపించాయి.
పులివెందులలోనూ వైసీపీకి షాక్!
ఈ ఎన్నికల్లో వైసీపీకి అత్యంత కీలకమైన పరిణామం పులివెందులలో కనిపించింది. వైసీపీ అధినేత జగన్ సొంత గడ్డగా పేరొందిన పులివెందుల ప్రాంతంలోనూ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగలడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తుండగా.. వైసీపీకి బలమైన పట్టు ఉందని భావించే ప్రాంతాల్లోనూ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం ఆ పార్టీ శ్రేణులను ఆలోచనలో పడేసింది.
అల్లూరి మినహా మిగతా జిల్లాల్లో కూటమి ఆధిపత్యం!
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 27 జడ్పీ పీఠాలను కూటమి కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అల్లూరి జిల్లాలో మాత్రం వైసీపీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూటమి అభ్యర్థుల విజయ పరంపర కొనసాగింది. జిల్లాలవారీగా చూస్తే టీడీపీ తన సంస్థాగత బలాన్ని మరోసారి నిరూపించుకుంది. జనసేన కూడా పలు ప్రాంతాల్లో గణనీయమైన స్థానాలను దక్కించుకోగా.. బీజేపీ సైతం తన వాటాను పెంచుకుంది. మరోవైపు వైసీపీ మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితమవడం ఆ పార్టీ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
వైసీపీకి ప్రజలు ఇచ్చిన హెచ్చరికేనా?
ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికలతో పాటు పరిషత్ ఎన్నికల్లోనూ కూటమి ఆధిపత్యం కొనసాగడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. కేవలం అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం కాకుండా స్థానిక సంస్థల్లోనూ ప్రజల మద్దతు కూటమి వైపు ఉందని ఈ ఫలితాలు సంకేతాలిస్తున్నాయి. మరోవైపు వైసీపీకి వరుసగా ఎదురవుతున్న పరాజయాలు ఆ పార్టీ నాయకత్వానికి సవాలుగా మారాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనపడిందా? స్థానిక నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందా? గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పట్టు తగ్గిందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. పరిషత్ ఎన్నికల ఫలితాలు కూటమికి మరింత రాజకీయ బలాన్ని అందించగా.. వైసీపీకి మాత్రం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి. స్థానిక సంస్థల్లో సాధించిన ఈ విజయాన్ని కూటమి భవిష్యత్తు రాజకీయాలకు ఎలా ఉపయోగించుకుంటుంది? ఓటమి నుంచి వైసీపీ ఎలాంటి పాఠాలు నేర్చుకుంటుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..