
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో మద్యం విక్రయాల విధానాన్ని క్రమబద్ధీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి విమానాశ్రయం మినహా రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో బార్లు, వైన్ షాపుల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ కొత్త ఎక్సైజ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అదే సమయంలో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూర్చడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. కొత్త విధానం ప్రకారం విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసే బార్లు, వైన్ షాపులు రోజుకు 24 గంటల పాటు పనిచేసేందుకు అనుమతి ఉంటుంది. విమానాల రాకపోకలు రాత్రింబవళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ వెసులుబాటు కల్పించారు.
దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అమలులో ఉన్న విధానాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ బార్ లైసెన్స్ పొందిన నిర్వాహకులు గరిష్టంగా మూడు సర్వింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వైన్ షాప్ లైసెన్స్ పొందిన వారు మూడు కౌంటర్ల వరకు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే టెర్మినల్స్‌లో సేవలు అందించేందుకు ఈ వెసులుబాటు కల్పించారు.
విమానాశ్రయాల్లో మద్యం విక్రయాల లైసెన్స్ కాలపరిమితిని సంబంధిత ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే, ఎయిర్‌పోర్ట్‌లో వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించిన ఒప్పంద కాలానికి అనుగుణంగానే బార్ లేదా వైన్ షాప్ లైసెన్స్ అమలులో ఉంటుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎయిర్‌పోర్ట్ బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు రూ.5 లక్షల దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ వైన్ షాప్ లైసెన్స్‌కు దరఖాస్తు రుసుము రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రయాణికుల సంఖ్యను ఆధారంగా తీసుకుని బార్లపై వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను నిర్ణయించారు. ఏడాదికి 20 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయాల్లోని బార్లకు రూ.25 లక్షల వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను విధిస్తారు. 20 లక్షల కంటే తక్కువ ప్రయాణికులు ఉన్న విమానాశ్రయాల్లోని బార్లకు ఈ పన్ను రూ.15 లక్షలుగా నిర్ణయించారు.
విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసే వైన్ షాపులకు ఏటా రూ.1 కోటి రిటైల్ ఎక్సైజ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుల కొనుగోలు సామర్థ్యం, విమానాశ్రయాల వాణిజ్య ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ పన్నును ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విధానం రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలకు వర్తించినప్పటికీ, తిరుపతి విమానాశ్రయానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. తిరుమల శ్రీవారి క్షేత్ర పవిత్రత, ఆధ్యాత్మిక భావాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ బార్లు, మద్యం షాపులకు అనుమతి ఇవ్వలేదు. అయితే.. విమానాశ్రయాల్లో బార్లు, వైన్ షాపులకు లైసెన్సులు మంజూరు చేసే సమయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. జాతీయ, రాష్ట్ర రహదారుల సమీపంలో మద్యం విక్రయాలపై ఉన్న నిబంధనలతో పాటు విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించిన దూర పరిమితి నిబంధనలు కూడా ఈ లైసెన్సులకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మూడేళ్లకు ఒకసారి ప్రయాణికుల రద్దీ, వాణిజ్య కార్యకలాపాలు, ప్రభుత్వ ఆదాయం వంటి అంశాలను సమీక్షించి అవసరమైతే విధానంలో మార్పులు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రమాణాల వాణిజ్య సేవలను అందించడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూర్చడం ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. విమాన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే, ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..