
సమాజంలో దశాబ్దాలుగా వివక్ష, నిరాకరణ, ఉపాధి లేమి మరియు గుర్తింపు సమస్యలతో సతమతమవుతున్న ట్రాన్స్‌జెండర్ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండంత భరోసా ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, వారి సామాజిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు’ను ఏర్పాటు చేస్తూ, దానికి ప్రతినిధులను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ ఎంఎస్ నంబర్ 14ను విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019’, ‘రూల్స్-2020’ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డు పనిచేస్తుంది. ఈ బోర్డులో వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆంధ్రా ప్రాంత ప్రతినిధిగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్, రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులుగా కోటా ప్రేమ్ సాగర్ రాయ్ (తూర్పుగోదావరి), నక్క జీవన్ కుమారి (గుంటూరు), బోను దుర్గ (ప్రకాశం)లను సభ్యులుగా నియమించారు. వీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రెండేళ్ల పాటు లేదా ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
కుటుంబాల నుంచి వెలివేత, విద్యావకాశాలు కోల్పోవడం, వైద్య సేవల్లో చిన్నచూపు వంటి సమస్యలకు ఈ బోర్డు పరిష్కారం చూపనుంది. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ల సమస్యలను గుర్తించి నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం. విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో వివక్ష లేకుండా చూడటం. వీరికి ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సామాజిక భద్రత కల్పించడంపై బోర్డు కీలక సూచనలు చేస్తుంది. వారి సంక్షేమానికి తీసుకోవల్సిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వెల్ఫేర్ బోర్డు ముఖ్య ఉద్దేశ్యం.
దేశవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ వర్గాల హక్కులపై చర్చ పెరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. కుటుంబాల నుంచి వెలివేత, చదువు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, వైద్య సేవల్లో వివక్ష, గుర్తింపు పత్రాల సమస్యలు వంటి అనేక ఇబ్బందులు ఇప్పటికీ ఈ వర్గాలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ద్వారా ట్రాన్స్‌జెండర్ వర్గాల సమస్యలను నేరుగా ప్రభుత్వ వ్యవస్థలో చర్చించే అవకాశం ఏర్పడింది. సంక్షేమ పథకాల అమలు, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత వంటి అంశాలపై సమన్వయంతో పనిచేసే అవకాశం ఈ బోర్డుకు ఉండనుంది.
ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019 ప్రకారం ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై వివక్షను నిషేధించారు. ఉద్యోగం, విద్య, ఆరోగ్యం, నివాసం, ప్రజా సేవల విషయంలో సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంచారు. అదే చట్టానికి అనుగుణంగా రూపొందించిన రూల్స్-2020 ప్రకారం రాష్ట్ర స్థాయిలో వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఇప్పుడు సభ్యుల నియామక ప్రక్రియ పూర్తి చేసింది. ట్రాన్స్‌జెండర్ వర్గాలను కేవలం సామాజిక కోణంలో కాకుండా హక్కులు కలిగిన పౌరులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ముందుకు వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ దృష్టికి ట్రాన్స్‌జెండర్ల సమస్యలను తీసుకెళ్లగా, ప్రభుత్వం తక్షణమే స్పందించి బోర్డును ఏర్పాటు చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. “ట్రాన్స్‌జెండర్లను కేవలం సామాజిక కోణంలోనే కాకుండా, హక్కులు కలిగిన పౌరులుగా ప్రభుత్వం గుర్తించడం గొప్ప పరిణామం. ఇది వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది,” అని ఆమె పేర్కొన్నారు.
ట్రాన్స్‌జెండర్లపై వివక్షను నిషేధిస్తూ, వారిని సమాజ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వెల్ఫేర్ బోర్డు ద్వారా ట్రాన్స్‌జెండర్ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇది వారి ఆత్మగౌరవ పోరాటంలో ఒక కీలక విజయంగా నిలవనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..