
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వివిధ వ్యాపారాలు, ఉత్పత్తుల తయారీ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు సేవారంగంలోనూ వారికి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు హోమ్ ఆయా, జెరియాట్రిక్ కేర్‌టేకర్‌గా పనిచేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.
ఈ కార్యక్రమాన్ని సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా శిక్షణ అందించనున్నారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని ఎలా చూసుకోవాలి, వారికి అవసరమైన ప్రాథమిక సహాయం ఎలా అందించాలి, వారితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్న మహిళలకు బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, ఆర్థిక నిర్వహణపై కూడా అవగాహన కల్పిస్తారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి సదుపాయం కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
మహిళలు సొంతంగా ఆదాయం సంపాదించేలా ఇప్పటికే ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. అరకు కాఫీ, ఛాయ్ రాస్తా, తృప్తి క్యాంటీన్ల వంటి వ్యాపారాల ఏర్పాటుకు డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తోంది. స్కూటీలు, ఆటోలు అందించడంతో పాటు ర్యాపిడో వంటి సంస్థలతో ఒప్పందాల ద్వారా రైడర్లుగా పనిచేసే అవకాశాలను కూడా కల్పిస్తోంది. మరోవైపు బ్యాంకు రుణాల సాయంతో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది.
డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ‘స్వయం ఏపీ’ పేరుతో ఏకీకృత బ్రాండ్‌ను తీసుకొచ్చింది. మహిళలు తయారు చేసిన వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఈ బ్రాండ్, లోగోను ప్రారంభించారు. అలాగే విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఈ నెల 13 నుంచి ‘సరస్’ పేరుతో డ్వాక్రా మహిళల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. అదే రోజు ఆన్‌లైన్ విక్రయాలను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటివరకు ఉత్పత్తుల తయారీ, చిన్న వ్యాపారాల నిర్వహణ వంటి రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. తాజా నిర్ణయంతో వృద్ధుల సంరక్షణ, రోగులకు సహాయక సేవలు అందించే రంగంలోనూ మహిళలకు శిక్షణ ఇవ్వనుంది. సరైన నైపుణ్యాలు నేర్చుకుని ఈ రంగంలో పనిచేయడం ద్వారా మహిళలు ఆదాయం సంపాదించేందుకు మార్గం ఏర్పడనుంది. గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలను విస్తరించడంలో ఈ శిక్షణ కార్యక్రమం ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.