ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్‌తో 175 కొత్త ఎంబీబీఎస్ సీట్లు

AP MBBS Seats 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య విద్యకు భారీ ఊతం లభించింది. ఎన్ఎంసీ అనుమతులతో పిడుగురాళ్లలో కొత్తగా 100 ఎంబీబీఎస్ సీట్లు ప్రారంభం కాగా, విజయవాడ సిద్ధార్థ, కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 175 సీట్లు మంజూరయ్యాయి. దీంతో 2026-27 విద్యా సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం 275 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్‌తో 175 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
AP MBBS Seats 2026

Edited By:

Updated on: Jul 13, 2026 | 4:03 PM

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య విస్తరణకు వరుసగా శుభవార్తలు వస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను పరిశీలించిన జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ).. మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది, బోధనా ప్రమాణాలను పరిశీలించి దశలవారీగా అనుమతులు ఇస్తోంది. ఇప్పటికే పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా.. తాజాగా విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాలకు 75 అదనపు సీట్లు మంజూరు చేసింది. ఇదే సమయంలో కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 అదనపు సీట్లను కూడా ఎన్ఎంసీ ఆమోదించింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రానికి మొత్తం 275 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

పిడుగురాళ్లకు తొలి బ్యాచ్

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుంచే 100 ఎంబీబీఎస్ సీట్లతో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్ఎంసీ అనుమతితో తొలిసారిగా ఈ కళాశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరగనున్నాయి. దీంతో పల్నాడు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ విద్య మరింత చేరువ కానుంది.

విజయవాడ సిద్ధార్థకు మరో 75 సీట్లు

విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అదనంగా 75 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలోని అత్యంత కీలక ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒకటైన సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మరింత మంది విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు లభించనున్నాయి.

కడప, నెల్లూరుకు కూడా పెరిగిన సీట్లు

తాజాగా కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 అదనపు ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేసింది. దీంతో కడపలో మొత్తం సీట్లు 175 నుంచి 250కు, నెల్లూరులో 175 నుంచి 200కు పెరిగాయి. ఈ పెంపుతో రాష్ట్రానికి మరో 100 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా లభించాయి.

మూడేళ్లలో 455 సీట్ల పెంపు

ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికాబద్ధమైన చర్యలతో గత మూడు విద్యా సంవత్సరాల్లో రాష్ట్రంలో మొత్తం 455 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి.

  • 2024-25 : 150 సీట్లు
  • 2025-26 : 30 సీట్లు
  • 2026-27 : 275 సీట్లు దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్య విద్య అభ్యసించే అవకాశాలు గణనీయంగా పెరిగాయి.

ఎన్ఎంసీ ఎందుకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది..?

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, అధ్యాపకుల నియామకం, వైద్య పరికరాల ఏర్పాటు, బోధనా ఆస్పత్రుల బలోపేతం, ఎన్ఎంసీ నిర్దేశించిన ప్రమాణాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల జరిగిన తనిఖీల్లో ఈ ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఎన్ఎంసీ భావించడంతో వరుసగా సీట్ల పెంపునకు అనుమతులు లభిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సంతృప్తి

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ టీవీ9తో మాట్లాడుతూ… ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతులు, అధ్యాపకుల నియామకాలు, వైద్య పరికరాల ఏర్పాటు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదే ప్రణాళికాబద్ధమైన కృషి ఇప్పుడు వరుసగా సీట్ల పెంపు రూపంలో ఫలిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్య విద్య విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని, ఈ విద్యా సంవత్సరంలోనే 275 కొత్త ఎంబీబీఎస్ సీట్లు రావడం రాష్ట్ర విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలను ఎన్ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది మరిన్ని సీట్ల సాధనకు కృషి కొనసాగిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

Follow Us