ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరో అంశం అగ్గిరాజేస్తోంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఏపీలో టీచర్ల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయ దుమారానికి కారణమైంది. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందని, తమ ప్రభుత్వం తెలంగాణలో ఉపాధ్యాయులకు మంచి ఫిట్మెంట్ ఇచ్చిందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అలాగే మోటార్లకు మీటర్లు పెట్టబోమని తెలంగాణ ప్రభుత్వం అంటే రాష్ట్రానికి ఇచ్చే 30 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం నిలిపేసిందన్నారు. ఏపీ సీఏం జగన్‌లా కేంద్రం మాటకు ఒప్పుకుని ఉంటే ఏటా 6 వేల కోట్లు వచ్చేవన్నారు. ఈ డబ్బులతో మరికొన్ని పథకాలు పెట్టేవాళ్లమన్నారు హరీశ్‌రావు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై పలు విషయాల్లో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీచర్ల విషయమై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చి టీచర్లతో మాట్లాడాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. తెలంగాణలో ఇస్తున్న పీఆర్ సీని, ఆంధ్రప్రదేశ్ తో ఇస్తున్న పీఆర్ సీ తో పోల్చాలని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రెండు రాష్ట్రాల పీఆర్ సీలను పక్కపక్కన బెట్టి చూసుకుంటే అప్పుడు తేడా తెలుస్తుందన్నారు. అనవసర వ్యాఖ్యలు ఎందుకు చేస్తారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ, హరీష్ రావుకు హితవు పలికారు.
విశాఖపట్టణంలో గురువారం (సెప్టెంబర్ 29)వ తేదీన మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండలో పాత గెస్ట్ హౌజ్ పడగొట్టి కొత్త గెస్ట్ హౌస్ లేదా సీఎం అధికార నివాసం కడితే తప్పేంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనికి సంబంధించి పర్యావరణ వివాదం తలెత్తితే తాము చూసుకుంటామని అన్నారు. అవసరమైతే రుషి కొండ కు అఖిలపక్ష నేతలను తీసుకెళ్ళి చూపిస్తామని అన్నారు. విశాఖపట్టణానికి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఇక్కడకు కార్యనిర్వహక రాజధాని రావల్సిందేనని మంత్రి చెప్పారు. అలాగే ప్రశాంత్ కిశోర్ బృందం సలహాలు తీసుకోవడంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి. పీ కే టీమ్ ఒక సలహా మండలి మాత్రమేనని, వాళ్ల సలహాలు బాగుంటే తీసుకుంటామని, లేదంటే లేదని తేల్చిచెప్పారు.
రాజకీయ పార్టీగా పోటీ చేసేటప్పుడు ప్రతీ స్థానంలో గెలవాలని కోరుకుంటుందని, అందులో తప్పేముందని అన్నారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో దాదాపు 97 శాతం పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమానికి మారుపేరుగా తమ ప్రభుత్వం ఉందని తిరిగి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి రైతుల మహాపాదయాత్రపై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ భూముల ధరలు పెంచుకునేందుకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కొందరు రైతులతో టీడీపీ పాదయాత్ర చేయిస్తోందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అధికార వికేంద్రీకరణ అన్నది తమ ప్రభుత్వ విధానమని బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు. అమరావతి – అరసవెల్లి పాదయాత్ర పై ఉత్తరాంధ్ర టీడీపీ నాయకుల వైఖరి అమానుషం గా ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కు వళ్ళు పెరిగిందే కానీ బుర్ర పెరగలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనేదో ఒక జ్ఞాని లాగా మమ్మల్ని దద్దమ్మ లు అంటున్నారని, పద్ధతి మార్చుకోవాలని సూచించారు. హుధ్ హుద్ తుఫాన్ సమయం లో వర్షాలకు తడిసి పోయాయనే పేరుతో టీడీపీ నాయకులు ఎమ్మార్వో కార్యాలయాల్లో రికార్డు లు తారుమారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..