CM Jagan: సీమవాసుల కల నెరవేరబోతుంది.. కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఇవాళ భూమిపూజ చేయబోతున్న సీఎం జగన్

|

Feb 15, 2023 | 6:43 AM

సీమవాసులారా ఊపిరిపీల్చుకోండి. ఇన్నాళ్లూ అవాంతరాలు, ఇప్పుడు పరుగులు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఇవాళ భూమిపూజ చేయబోతున్నారు ఏపీ సీఎం జగన్. 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మితమవుతున్న ప్లాంట్ అందుబాటులోకి వస్తే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించబోతుంది.

CM Jagan: సీమవాసుల కల నెరవేరబోతుంది.. కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఇవాళ భూమిపూజ చేయబోతున్న సీఎం జగన్
Andhra Pradesh CM Jagan
Follow us on

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం. రాయలసీమ ప్రజల చిరకాల వాంచ. ఎన్నో ఏళ్లుగా అనేక అవాంతరాలు ఎదుర్కొంటూ నేడు పట్టాలు ఎక్కబోతుంది. ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త రూపు తీసుకుంటున్న స్టీల్‌ ఫ్యాక్టరీకి కరోనా సైతం అడ్డంకిగా మారింది. రాజశేఖర రెడ్డి మానస పుత్రికగా పేరున్న కడప స్టీల్ ప్లాంట్ రచ్చ నేటితో ముగియనుండటంతో వైసీపీ వర్గాలు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌ను బ్రహ్మాణి స్టీల్స్‌కు అప్పజెప్పిన వైఎస్సార్ అకాల మరణంతో నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు పక్కన పెట్టడంతో కడప స్టీల్ ప్లాంట్ మరుగున పడింది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కట్టడం కుదరదు, ఇది అనువైన ప్రదేశం కాదని కేంద్రం సైతం చేతులు దులిపేసుకుంది.

తరువాత 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో కాకుండా మరో చోట శిలాఫలకం వేసింది. కేంద్రంతో పనిలేదు మేమే కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2019లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో స్థానికుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడునెలలకు సున్నపు రాళ్లపల్లిలో శంకుస్థాపన చేశారు సీఎం జగన్.

తండ్రి మానసపుత్రికను సీఎం పూర్తి చేస్తారని ఆశపడ్డ వారికి కరోనా రూపంలో మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి. ఇంతకాలమైనా ప్లాంట్ నిర్మాణానికి అతీగతీ లేకపోవడంతో కడప స్టీల్‌ ప్లాంట్ నిర్మాణం కలగానే మిగిలిపోయిందని అంతా భావించారు. కాని సీఎం జగన్ మాత్రం రాయలసీమ యువత ఉపాధిని సజీవంగా ఉంచారు. ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి అన్ని అనుమతులు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. మైనింగ్ శాఖ సైతం క్లియరెన్స్ ఇచ్చింది. వచ్చే ఏడాదిన్నరలో స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు రాబోతున్నాయని స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు. ప్రత్యక్షంగా. పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించబోతుందని అధికారులు చెప్తున్నారు. 8 వేల 800 కోట్లతో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో JSW గ్రూప్ స్టీల్‌ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం