
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో సొంతిల్లు లేనివారికి ఊరట కలిగించే వార్త తెలిపారు. కొత్త ఇళ్ల నిర్మాణంపై తాజాగా కీలక ప్రకటన చేశారు. ఆర్టీజీఎస్ అభివృద్ది చెందిన అవేర్ 2.0 మొబైల్ యాప్‌ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరో 5 లక్షల ఇళ్లను నిర్మించాలని, వీటిని పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. టిడ్కో ఇళ్లకు అదనంగా ఈ 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వీలైనంత త్వరగా వీటిని లబ్దిదారులకు అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇక ఇళ్ల నిర్మాణంతో పాటు మరోవైపు స్థలాల పంపిణీ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దాదాపు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కావాల్సిందిగా కోరారని, వీరికి అందించేలా ప్రణాళికలు రచించాలని కోరారు. అలాగే ఇసుక సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడాలన్నారు. రాబోయే వర్షాకాలంలో ఇసుక రవాణాకు ఇబ్బంది కలిగే అవకాశముందని, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇసుకకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ ఏడాది మరోసారి సామూహిక గృహప్రవేశాలు ఒకేసారి భారీగా చేపడతామని తెలిపారు. టిడ్కో ఇళ్ల పనులను కూడా వేగవంతం చేయాలని కోరారు.
వర్షాల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ముందుగానే ఫోన్లకు పిడుగుపాటు హెచ్చరికలు పంపిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అయినా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. సెల్ టవర్ల లొకేషన్ ఆధారంగా పిడుగుపాటు హెచ్చరికల మెస్సేజ్‌లు ఎస్‌ఎంఎస్ రూపంలో పంపిస్తున్నామని, ఇలాంటి సమయంలో క్షేత్రస్ధాయి సిబ్బంది ప్రజలను అప్రమత్తంగా చేయాలని సూచించారు. పిడుగుపాటు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలని సూచించారు. కొత్త కరిక్యూలమ్ సిద్దం చేయాలని అధికారులకు చంద్రబాబు తెలిపారు. సాంప్రదాయ కోర్సులను పక్కన పెట్టి మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను తీసుకురావాలన్నారు. దీని వల్ల విద్యార్థులకు చదువు పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. యూనివర్సిటీలతో అనుసంధానం చేసుకుంటూ మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రంలో కళాశాల విద్యను మరింత పటిష్టం చేయాలని చంద్రబాబు సూచించారు.