
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. విశాఖ వేదికగా నవంబర్ 14,15న జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల ప్రతినిధులు హాజరుకానుండటంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సదస్సు ఏర్పాట్లను ఇప్పటికే మంత్రులకు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్‌లో ఏర్పాట్లపై మంత్రులను వివరాలు అడిగి తెలుసుకోవడంతోపాటు పలు కీలక సూచనలు చేయనున్నారు.
అలాగే రాష్ట్రానికి సుమారు లక్ష కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొంథా తుఫాన్ ప్రభావం.. దాని వల్ల జరిగిన నష్టం అంచనాలు, బాధితులకు అందించాల్సిన పరిహారంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో పాటు CRDA పనులు కోసం NaBFID నుంచి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు అవసరమైన అనుమతిని కూడా కేబినెట్ ఇవ్వనుంది.
ఈ కేబినెట్ భేటీలో అత్యంత కీలకంగా పరిగణించదగిన అంశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తుది నిర్ణయం ఒకటి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు జిల్లాల విభజన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగి ఒక నిర్ణయం తీసుకుంది కూడా. ఆ సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజనపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.
మొత్తంగా… వీటన్నిటితో పాటు మరికొన్ని అంశాలపైనే కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..