
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరప్రాంత పర్యాటక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త ‘బీచ్ షాక్ పాలసీ’ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా G.O.Ms.No.363 ద్వారా ఎక్సైజ్ నిబంధనలలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల ఉపసంఘం (GoM) చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పాలసీలోని అసలు నిబంధనలు ఏమిటి, క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లు ఏంటో చూద్దామా? ఏపీలో బీచ్ పర్యాటకాన్ని పెంచేందుకు ప్రభుత్వం కొత్తగా బీచ్ షాక్ విధానాన్ని తీసుకొచ్చింది. పర్యావరణానికి ఇబ్బంది లేని తాత్కాలిక కట్టడాలతో, పరిమిత వేళల్లో తక్కువ ఆల్కహాల్ ఉండే పానీయాలను విక్రయించేందుకు వీలుగా జీవో నెంబర్ 363ని జారీ చేసింది. పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో రెండేసి చొప్పున బార్ లైసెన్సులు ఇవ్వనున్నారు.
ఏపీకి ఉన్న 975 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరాన్ని పర్యాటకంగా వాడుకునేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం.. బీచ్ ల్యాండ్స్‌లో పర్యావరణ హితమైన తాత్కాలిక సామగ్రితో మాత్రమే ఈ షాక్స్ నిర్మించాలి. ఎలాంటి సిమెంట్, కాంక్రీట్ కట్టడాలకు అనుమతి లేదు. ప్రాథమికంగా బాపట్ల జిల్లా సూర్యలంకలో రెండు, విశాఖపట్నంలో రెండు బీచ్ షాక్ బార్ లైసెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పాలసీపై స్థానికుల నుండి, కొందరు పర్యాటకుల నుండి స్వల్ప వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాధారణంగానే వీకెండ్స్‌లో బీచ్‌లకు వచ్చే కొందరు యువకులు మద్యం మత్తులో సముద్రంలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు అధికారికంగా బీచ్‌లోనే మద్యం అందుబాటులోకి తెస్తే.. తాగి సముద్రంలో ఈతకు వెళ్లే ప్రమాదం ఉందని, దీనివల్ల మునిగి చనిపోయే వారి సంఖ్య పెరగొచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో పటిష్టమైన నిఘా, లైఫ్ గార్డ్స్ లేకపోతే ప్రమాదాలు తప్పవనే విమర్శలు వస్తున్నాయి.
ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను జీవోలో పొందుపరిచింది. బీచ్ షాక్స్‌లో ఘాటు మద్యం (IMFL/విదేశీ మద్యం) అమ్మడానికి వీల్లేదు. కేవలం ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే బీర్, వైన్, రెడీ-టు- డ్రింక్ (RTD) పానీయాలు మాత్రమే విక్రయించాలి. అలాగే, మద్యం సరఫరాను ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకే పరిమితం చేశారు. కస్టమర్లు మద్యం బాటిళ్లను బయటకు తీసుకెళ్లకూడదని, షాక్ పరిధిలోని డెక్ బెడ్లు, అంబ్రెల్లాల లోపలే వినియోగించాలని స్పష్టం చేశారు. ఈ లైసెన్సుల కోసం కేవలం స్టార్ హోటళ్లు, టూరిజం రిసార్టులు లేదా టూరిజం శాఖ రిజిస్టర్డ్ సంస్థలు మాత్రమే అర్హులు. 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇవి ఉండాలి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) క్లియరెన్స్, ఫైర్ సేఫ్టీ, FSSAI అనుమతులు తప్పనిసరి. ఈ లైసెన్స్ కోసం ఏడాదికి రూ. 7,50,000 రిటైల్ ఎక్సైజ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లైసెన్సులు 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి.
ప్రభుత్వం తెచ్చిన జీవో 363 ద్వారా పర్యాటక రంగంలో రాబడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, భద్రతా పరమైన సవాళ్లు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. కేవలం లైట్ ఆల్కహాల్ (బీర్, వైన్)కి మాత్రమే అనుమతి ఇవ్వడం, రాత్రి 8 గంటలకే మద్యం సరఫరా నిలిపివేయడం వంటివి కొంతవరకు సానుకూల అంశాలైనప్పటికీ.. మద్యం మత్తులో పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకుండా చూడటం ఎక్సైజ్, టూరిజం పోలీసులకు పెద్ద సవాలు కానుంది. పైలట్ ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడే ఈ భద్రతా లోపాలను గమనించి సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి