
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ దారుణం జరిగింది. కరగాని దిల్లేశ్వరి గొంతును బ్లేడ్ తో కోసి హత్య చేయాలని యత్నించాడు భర్త గోవింద్. శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి చెందిన కరగాని గోవిందు, దిల్లేశ్వరి ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి 13 సంవత్సరాలు క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అక్కడి నుండి ఉపాధి కోసం తణుకు తీసుకు వచ్చారు. దిల్లేశ్వరితో పెళ్ళి జరిగిన ఒక సంవత్సరం గడిచిన తరువాత నుండి 12 సంవత్సరాలుగా నరకయాతన చూపించాడు గోవింద్. భర్త పెట్టే చిత్రహింసలు అనుభవిస్తూ కుటుంబ బాధ్యతలను ఎదురు ఈదుతూ తణుకులో ఒక డ్రై ఫ్రూట్ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తుంది దిల్లేశ్వరి.
ఈ పరిస్థితుల్లో చిన్న కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. ఆ బాధను దిగమింగుకొని మరో కుమారుడుని చదివించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తూంది దిల్లేశ్వరి. కొద్ది కాలం కిందట రోడ్డు ప్రమాదంలో భర్త గోవింద్‌కు కాలు విరిగిపోయింది. అయినా భర్త పెట్టిన కష్టాలను మరిచిపోయి మంచంపై ఉన్న అతనికి సేవలు చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇంత చేసినా చెడు వ్యసనాలకు బానిసైన భర్త గోవింద్ భార్య దిల్లేశ్వరిపై అనుమానం పెంచుకున్నాడు. భార్యను అనుమానంతో చిత్రహింసలకు గురిచేస్తూ ఉండేవాడు.
ఇక భర్త రాక్షసత్వాన్ని భరించలేని దిల్లేశ్వరి పోలీసులను ఆశ్రయించింది. తనకు తెలియకుండా తన కుమారుడు తీసుకుపోయి వేరేగా ఉంటున్న భర్త నుండి బిడ్డను తన దగ్గరికి పంపాలని బ్రతిమలాడింది. పోలీసులు సహాయంతో తన కుమారుని తన దగ్గరకు రప్పించుకుంది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న భర్త ఆమెను ఎలాగైనా మట్టుపెట్టాలని అనుకున్నాడు. ప్లాన్ ప్రకరాం తన ఆరోగ్యం బాగోలేదని, కాలు నొప్పితో నడవలేక పోతున్నానని భార్య దిల్లేశ్వరి దగ్గరకు వెళ్ళి దొంగ ప్రేమ నటించాడు.
దీంతో చలించి పోయిన భార్య భర్తను బండిపై ఎక్కించుకొని ఇంటికి బయలు దేరింది. అయితే బండిపై వెనక కూర్చున్న భర్త మార్గమధ్యలోకి వెళ్లగానే తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో భార్య గొంతు కోశాడు. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. తీవ్ర గాయాలతో పడిఉన్న భార్యను అక్కడే వదిలేసి ఆ మోటార్ సైకిల్ పై పరారయ్యాడు భర్త గోవింద్. అక్కడున్న స్థానికులు దిల్లేశ్వరిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.