
ఏపీలో సొంతిల్లు లేనివారికి కూటమి సర్కార్ తీపికబురు అందించింది. 2029 నాటికి ఇల్లు లేని ప్రతీఒక్కరికీ పక్కా ఇళ్లు అందిస్తామని తెలిపింది. ఇంటి నిర్మాణానికి స్థలం లేనివారికి ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారధి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి ఏపీ ప్రభుత్వ పేదల ఇంటి నిర్మాణాలకు అదనంగా మరికొంత ఆర్దిక సాయం పంపిణీ చేస్తోంది. పీఎంఏఐ 2.0 పథకం ద్వారా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా ఇళ్ల కోసం ఇటీవల 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అర్హులైనవారికి గుర్తించి ఇళ్లను మంజూరు చేస్తున్నారు.
ఇక ఇంటి నిర్మాణాల కోసం నిధులు సరిపోక ఇబ్బంది పడుతున్న పేదలకు కూటమి ప్రభుత్వం అదనంగా సాయం అందిస్తోంది. పీవీటీజీలకు రూ.లక్ష సాయం అందిస్తుండగా.. ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీలకు రూ.50 వేలు, బీసీలు, మైనార్టీలకు రూ.50 వేల చొప్పున జమ చేస్తున్నారు. ప్రత్యేక ఆర్ధిక సాయంతో పేదలకు భరోసా కల్పిస్తున్నట్లు పార్థసారధి స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అదనపు సాయాన్ని అందిస్తున్నామన్నారు. దీని వల్ల 53.98 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీల సొంతింటి కల నెరవేరబోతుందన్నారు. 2024-29 మధ్య కాలంలో 16,63,155 ఇళ్లను నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు పార్థసారధి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025 నంబర్ 12న 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయగా… ఈ ఏడాది మార్చిలో ఉగాది రోజున 2.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించామన్నారు. లబ్దిదారులకు అందించి పేదల కళ్లల్లో ఆనందం చూశామన్నారు.
2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఇళ్ల నిర్మాణానికి రూ.14,300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పార్థసారధి తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 4.54 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోగా.. 2027-28 ఆర్ధిక సంవత్సరంలో 3.90 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఇక 2028-29 ఆర్ధిక సంవత్సరంలో 2.68 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 2.70 ఇళ్లు, అనంతరం సెప్టెంబర్ నాటికి 1.62 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని చెప్పారు. పీఎంఏవై 1.0 పథకం ద్వారా మంజూరైన ఇళ్లను వేగవంతంగా పూర్తి చేసి అందించామన్నారు. ప్రభుత్వం అదనపు సాయం అందించడం వల్ల రూ.3,219 కోట్ల అదనపు భారం పడిందని పేర్కొన్నారు. కాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇళ్లను నిర్మిస్తున్నారు.