
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ప్రభుత్వ స్కూళ్లలోనే కాకుండా ప్రైవేట్ స్కూల్స్‌లోనూ విద్యార్థులు ఉచితంగా చదువుకోవచ్చు. ఈ మేరకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లల్లో ఉచిత ప్రవేశాలకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వచ్చే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ స్కూళ్లల్లో 25 శాతం ఉచిత కోటా అడ్మిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదులకానుంది. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లల్లో 25 శాతం సీట్లు కేటాయించనున్నారు.
25 శాతం సీట్లలో ఎస్సీలకు 10 శాతం కేటాయించనుండగా.. 4 శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. ఇక బీసీ, మైనారిటీ, ఇతరులకు 6 శాతం సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక హెచ్‌ఐవీ, అనాథ పిల్లలకు 5 శాతం సీట్లు ఇస్తారు. ఒకటో తరగతిలో ప్రవేశానికి పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎంఈవో ఆఫీసుల్లో లేదా ప్రభుత్వ వెబ్‌సైట్ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
గ్రామీణ విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోరూ.1.44 లక్షల్లోపు ఉండాలి. జూన్ 2 2020 నుంచి మే 31 2021 మధ్య జన్మించిన పిల్లలు స్టేట్ సిలబల్ స్కూల్స్‌లో చేరడానికి అర్హులు. ఇక 2020 ఏప్రిల్ 2020 నుంచి 2021 మార్చి 31 మధ్య జన్మించిన పిల్లలు సీబీఎస్‌ఈ సిబబస్ ఉన్న స్కూల్స్‌లో చేరేందుకు అర్హులుగా ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులు ఐదేళ్లు నిండి ఉండాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికేట్లు అవసరం. ఏవైనా సందేహాలుంటే 1800425899 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులకు ఇది మంచి అవకాశమని, ప్రైవేట్ స్కూళ్లల్లో విద్యా హక్కు చట్టం ద్వారా ఉచితంగా చదువుకునే అవకాశముందన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు దీనికి గమనించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రైవేట్ స్కూళ్లల్లో చదవాలంటే వేలకు వేలు ఖర్చు అవుతుంది. అదే ఈ అవకాశం ద్వారా విద్యార్థులు ఉచితంగా చదువుకోవచ్చు. దీని వల్ల తల్లిదండ్రులకు కూడా ఆర్ధిక భారం తగ్గుతుంది.