AP CM YS Jagan Letter to PM Modi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాక్సినేషన్‌పై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏపీలో 18-44 వయసు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సరిపడా డోసులను కేంద్రం సరఫరా చేయాలని లేఖలో కోరారు. ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం తప్పుడు సంకేతాలిస్తోందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తాయని చెప్పారు. దీంతో సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని జగన్ లేఖలో పేర్కొన్నారు.
కరోనా నియంత్రణలో వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అంటున్న నిపుణుల సూచనల మేరకు ప్రధాని మోదీకి శనివారం లేఖ రాశారు. ‘‘అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది మా నిర్ణయం. వ్యాక్సిన్ల కొరత వల్ల కేవలం 45ఏళ్ల పైబడిన వాళ్లకే ఇస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం తప్పుడు సంకేతాలిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో రూ.2వేల నుంచి 25వేల వరకు విక్రయిస్తున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. వ్యాక్సిన్ అనేది ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన విషయమని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఒక వైపు 45ఏళ్లు పైబడ్డ వాళ్లకే వ్యాక్సిన్ ఇవ్వలేకపోతున్నాం. 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ చేరాలంటే నెలలు పట్టేలా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు. దీని వల్ల సామాన్యులు వ్యాక్సిన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే వ్యాక్సిన్‌ను బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని సీఎం లేఖలో తెలిపారు. సరిపడా వ్యాక్సిన్ స్టాక్ ఉంటే.. ఎవరికైనా ఇవ్వొచ్చు. ఒక వైపు కొరత ఉంటే.. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులకు ఎలా ఇస్తారు?. వ్యాక్సిన్‌లన్నీ కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలి. వ్యాక్సిన్‌లు బ్లాక్ మార్కెట్‌కు చేరకుండా కట్టడి చేయాలి ’’ అని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు.